‘మేడారం’లో కాషాయ గుడారం..! 

BJP focus on the state to develop there party - Sakshi

     రాష్ట్రంలో బలోపేతానికి జాతరపై బీజేపీ కన్ను 

     కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలను తీసుకొచ్చేందుకు యత్నం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కమలనాథులు మేడారం జాతరపై దృష్టి పెట్టారు. కోట్లలో జనం తరలివచ్చే ఈ గిరిజన కుంభమేళాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే జాతరకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే గిరిజనులతోపాటు గ్రామాల పురోగతికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వివరించే స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, కిరెణ్‌ రిజిజు, జుయల్‌ ఓరం సహా పది మంది కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గిరిజన జనాభా అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లను ఆహ్వానించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తోపాటు మరికొందరు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించబోతున్నారు. సాధారణంగా జాతరలు, ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కమలనాథులు పార్టీ తరఫున వారిని రప్పించేందుకు యత్నిస్తున్నారు. 

పథకాలను వివరించే స్టాళ్లు.. 
కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అక్కడికి వచ్చే భక్తజనం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిడివి రెట్టింపు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రోడ్లు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నందున కేంద్ర ఉపరితల రవాణా శాఖ చేత ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేయించనున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలను వివరించనున్నారు. మహారాష్ట్రలో గిరిజన సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే చట్టం ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు ప్రత్యేక చొరవ చూపారని, దాన్ని వివరించే ఏర్పాటు కూడా చేయాలని నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపైనా అవగాహన కల్పించే స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 

కార్యకర్తలతో ప్రత్యేక శిబిరం 
బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చేరువగా ఉండే వనవాసీ కల్యాణ్‌ పరిషత్‌ కార్యకర్తలు.. భక్తుల సేవలో ఉండేలా నియోగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ దీనిపై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబైలకు పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చందా లింగయ్య ఇతర నేతలతో కలసి వెళ్లి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, గవర్నర్‌ విద్యాసాగరరావులతో భేటీ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top