అధికారికంగా నిర్వహించాల్సిందే..

BJP Demand State Government Should Officially Organize Telangana Liberation Day - Sakshi

తెలంగాణ విమోచన దినంపై బీజేపీ

రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ అవమానిస్తున్నారు

కేసీఆర్‌ కారులో మజ్లిస్‌ వారు కూర్చున్నారు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్ర విమర్శలు

మజ్లిస్‌ చేతిలో టీఆర్‌ఎస్‌ పావుగా మారింది: కిషన్‌రెడ్డి

సాక్షి, సంగారెడ్డి: ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా నిజాం నవాబు నిరంకుశ పాలన నుంచి విమోచనం పొందిన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలల్సిందేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి డిమాండ్‌ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాటిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 13 నెలల తర్వాత నిజాం నుంచి తెలంగాణకు విముక్తి లభించినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మజ్లిస్‌కు భయపడి కేసీఆర్‌ ఇంటి నుంచి బయటకు రావట్లేదని విమర్శించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారిని, ప్రజలను కేసీఆర్‌ అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ఆ సంస్కారం కూడా లేదా..
రాష్ట్ర హోం మంత్రికే అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే.. ప్రజలను ఏం కలుస్తావని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్‌ చేస్తారు కానీ.. విమోచనం కోసం పోరాడిన వారిని స్మరించుకునే సంస్కారం కూడా ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన్‌మంత్రి ఆవాస్‌యోజన, ఆయుష్మాన్‌ భారత్, ఫసల్‌ బీమా యోజన, కిసాన్‌ యోజన, కిసాన్‌ పింఛన్‌ యోజన, తదితర పథకాలు రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలకు కేసీఆర్‌ కీడు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెంచిన అంచనా వ్యయాలను బట్టే కేసీఆర్‌ అవినీతి అర్థమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పారు.

మజ్లిస్‌ కనుసన్నల్లో పాలన: జి.కిషన్‌రెడ్డి
మజ్లిస్‌ పార్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లిస్‌కు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని నిజాం పాలన తనకు ఆదర్శమని కేసీఆర్‌ చెప్పడం తెలంగాణ ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై హత్యలు, అరాచకాలు, మానభంగాలు, అకృత్యాలు జరిగాయన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రజాకార్ల వారసత్వ పార్టీ మజ్లిస్‌ అని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఊరూరా విజయవంతమైందని, ఇదే ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు.

కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలి: లక్ష్మణ్‌
కేసీఆర్‌ కుటుంబపాలన, అవినీతి నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. విమోచన దినాన్ని జరపాలని బీజేపీ సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తోందని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కుమ్రం భీం వంటి త్యాగధనులున్న ఈ తెలంగాణలో విమోచన దినాన్ని జరపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రాన్ని కోరి విమోచన దినాన్ని అధికారికంగా జరిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, ఎంపీలు సోయం బాబురావు, ధర్మపురి అరవింద్, గరికపాటి రాంమోహన్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, పి.శశిధర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top