ధుమల్‌ను దారుణంగా దెబ్బ తీసిన అధిష్టానం | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 11:21 AM

BJP Decision Reason for Prem Kumar Dhumal Lost - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో మూడింట రెండొంతులకు పైగా సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అయితే అధికారం లభించినా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ అనూహ్యంగా ఓటమిపాలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుజన్‌పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి, ఒకప్పటి తన అనుచరుడు రాజిందర్‌ రానా చేతిలోనే ధుమల్‌ దారుణంగా ఓటమిపాలయ్యారు.

ఓడిపోతారని ముందే తెలుసా?

ఆ ప్రాంతంలో అప్పటికే రానాకు మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేసిన మినీ గ్రామ సచివాలయం ఆలోచన అద్భుతంగా పని చేసింది. వివాదరహితుడు కావటం, పైగా అభివృద్ధి పనులు చేయటంతో ప్రజలంతా ఆయనవైపే మొగ్గు చూపారు. ఈ పరిణామాలన్నింటిని గమనించిన ధుమల్‌ తన ఓటమిని ముందుగానే గమనించారు. అందుకే తొలుత హమిర్‌పూర్‌ నుంచి పోటీచేయాలని ధుమల్ భావించారు. 

కానీ, దీనికి అధిష్టానం మాత్రం ససేమిరా అంది. సుజన్‌పూర్‌ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అక్కడి నుంచే పోటీచేసి తీరాలని ధుమల్‌కు సూచించింది. దీంతో తాను ఓడిపోతానని ముందే తెలిసి కూడా ఆయన ధైర్యం చేయగా.. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పార్టీ ధుమల్‌ రాజకీయ ప్రస్థానాన్నిగట్టిగానే దెబ్బతీసినట్లయ్యింది. 

గురు-శిష్యులు... 

రానా గతంలో బీజేపీలోనే ఉండేవారు. పైగా ధుమల్‌ ఆయనకు రాజకీయ గురువు కూడా. 1998లో ధుమల్‌ సీఎంగా ఉన్న సమయంలో.. పార్టీ మీడియా అధికార ప్రతినిధిగా రానా పని చేశారు కూడా. అయితే 2012 ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఈ విషయం ధుమల్‌కు చెప్పగా.. ఆయన అంగీకరించాడు. కానీ, అధిష్టానం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన రానా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.ఆపై ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014లో హమిర్‌పూర్‌ లోక్‌ సభ స్థానం నుంచి అనురాగ్‌ ఠాకూర్‌పై పోటీ చేసి ఓడిపోయారు.  ఇక ఇప్పుడు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గురువుపైనే పోటీ చేసిన గెలిచాడు. ఇక తన విజయంపై స్పందించిన రానా.. తనకు ధుమల్‌ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని చెప్పటం విశేషం.  

Advertisement
Advertisement