రజనీకి బీజేపీ గాలం?

Bjp attempts to form the alliance - Sakshi

కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలకు తావులేని కొత్తకూటమిని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. నటుడు రజనీకాంత్‌ ప్రకటించబోయే పార్టీతో పొత్తుపెట్టుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పొత్తుకోసం అద్వానీ తదితర అగ్రనేతలు  రాయబారాలు నడిపినా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నో చెప్పారు.

జయ  మరణాన్ని కేంద్రంలోని బీజేపీ అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. బీజేపీ కారణంగానే అధికార పార్టీలోని సీఎం పళనిస్వామి వర్గంతో కలిసిపోవాల్సి వచ్చిందని పన్నీర్‌ సెల్వం ఒప్పుకున్నారు కూడా. పార్లమెంటు ఎన్నికలకు తమిళనాడు శాఖను సంసిద్ధం చేసేందుకు ఈనెల 9వ తేదీన అమిత్‌షా చెన్నైకి వచ్చినపుడు సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు.

అనంతరం జరిగిన బహిరంగసభలో అనూహ్యంగా అన్నాడీఎంకే పాలనపై దుమ్మెత్తి పోశారు. అవినీతిలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యల ద్వారా అన్నాడీఎంకేకు రాంరాం చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.  రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీతో పొత్తు ద్వారా  కొత్తకూటమికి సన్నాహాలు చేయాలని రాష్ట్ర పార్టీకి అమిత్‌ సూచించినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్‌ భార్యపై విచారణ
తమిళసినిమా(చెన్నై): వాణిజ్య ప్రకటనల సంస్థకు బకాయిలు ఎగ్గొట్టిన కేసులో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ భార్య లత విచారణ ఎదుర్కోనున్నారు. ఆమెపై విచారణను కొట్టివేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

లత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చింది. 2014లో ‘కొచ్చాడయాన్‌’ చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో నిర్మాణ సంస్థ, లత డైరెక్టర్‌గా ఉన్న మీడియావన్‌ గ్లోబల్‌తో కుదిరిన ఒప్పందం మేరకు ఏడీబ్యూరో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తంతో పాటు రూ.1.2 కోట్ల లాభాలను ఆ సంస్థ తిరిగి చెల్లించలేదని కేసు వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top