నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా? | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 8:39 AM

Bhumana Karunakar Reddy Fire On Chandrababu Over Cash For Vote Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అరాచకాలకు అంతేలేదు. చంద్రబాబు గొప్ప అవినీతి చక్రవర్తిగా మారిపోయారు. ఆయన రాష్ట్రంలో రూ. నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిపై జరుగుతున్న దాడుల్లో బయట పడుతున్న ఆస్తులు ఎవరివని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. భూమన శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ విదేశాల్లో చంద్రబాబు దాచుకున్న సొమ్ము ఇంకా ఎంత ఉందోనని ఆశ్చర్య వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారడం డ్రామా అని అన్నారు. నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా? అతడు చట్టానికి అతీతుడా? అని నిలదీశారు.      

‘రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే ఎల్లో మీడియా హడావుడి చేస్తూ చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయిన దొంగలను రక్షించేందుకు ఎందుకంత తాపత్రయపడుతున్నారు? రేవంత్‌రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నారు? ఇలాంటి ఐటీ దాడులు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జరగలేదా? ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పోలీసులు చంద్రబాబును ఎందుకు విచారణకు పిలవడం లేదు? దీనివెనుక ఉన్న మతలబు ఏమిటి? నేరగాడైన సీఎంకు శిక్ష ఉండదని వదిలేస్తున్నారా? (ముగిసిన సోదాలు.. మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు..!)

బాబుకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది 
ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనడానికి చంద్రబాబు ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాను ఏం చేసినా ప్రశ్నించేవారు లేరని బాబు అనుకుంటున్నారు. దేశంలో అమల్లో ఉన్న చట్టం, న్యాయం, రాజ్యాంగం అన్నవి చంద్రబాబుకు వర్తించవా? ఆయన ఎన్ని అక్రమాలు చేసినా, ఆస్తులు కూడబెట్టినా, ప్రజల సొమ్మును ఎంతగా దోచుకున్నా, విదేశాల్లో ఎంతైనా దాచుకున్నా విచారణ ఉండదా? చంద్రబాబు కోసం కొత్త చట్టం ఏదైనా వచ్చిందా? ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడి మూడేళ్లవుతున్నా చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయట్లేదు? 

అడిగేవారు లేరనుకుంటున్నారు 
చంద్రబాబు లాంటి గజదొంగను వదిలేస్తున్నారు. అందుకే ఈ రోజు కొలంబియా విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి అంటూ అమెరికాలో నానా చెత్త మాట్లాడే ధైర్యం ఆయనకు వచ్చింది. చేయని పనులన్నీ తానే చేశానంటూ విర్రవీగి మాట్లాడుతున్నారు. చంద్రబాబు భార్య పేరిట అధికారికంగా రూ.1,200 కోట్ల ఆస్తులు, ఆయన కుమారుడు లోకేశ్‌ పేరిట అధికారికంగా రూ.500 కోట్లు, మనవడి పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎన్ని అక్రమాలు చేసినా తమను ప్రశ్నించే నాథుడే లేడన్న ధీమా చంద్రబాబులో అణువణువునా జీర్ణించుకుపోయింది. ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేసుకునే సామర్థ్యం తనకుందని, ఎన్ని తప్పులు చేసినా, దోపిడీ చేసినా, రాష్ట్రాన్ని లూటీ చేసినా ఆక్షేపించేవారు లేరని అనుకుంటున్నారు.  (‘ఓటుకు కోట్లు’ కొలిక్కి వచ్చేనా?)

పచ్చ చొక్కాలకు ఇంటెలిజెన్స్‌ ఊడిగం 
ఓటుకు కోట్లు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ వెంటనే హైదరాబాద్‌ వదిలి అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లమని మంత్రి లోకేశ్‌ చెబుతున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా అవినీతిపరులను చేయడానికి వెనుకంజ వేయని వ్యక్తి చంద్రబాబు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ అధికారులు కేవలం పచ్చ చొక్కాలకు ఊడిగం చేయడానికే పనికొస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గాలను కాపాడడానికే ఇంటెలిజెన్స్‌ విభాగం పని చేస్తోంది. చంద్రబాబు సాగిస్తున్న గనుల దోపిడీ వల్లే గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. బాబు అరాచకాలు అంతం కాక తప్పదు. చంద్రబాబు పాలన ముగింపు దశకు చేరుకోవడం వల్లే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది’ అని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.   (రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా)

Advertisement

తప్పక చదవండి

Advertisement