భారత్‌ బంద్‌: బాల్కనీలో నిల్చుంటే.. బుల్లెట్‌ తగిలి!

Bharat Bandh: One shot dead in MP during police-protester clash - Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్‌ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘భారత్‌ బంద్‌’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని  మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్‌లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

నిరసనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న భవనం బాల్కనీలోంచి రాహుల్‌ పాఠక్ అనే వ్యక్తి ఈ గొడవను చూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో.. ఓ బుల్లెట్‌ దూసుకొచ్చి ఆయనకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడని సమాచారం.

ఇటు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, బిహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో భారత్‌ బంద్‌ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్‌ జరపడంతో పలువురు గాయపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top