చెప్పింది వినాల్సిందే..

Bandaru Satyanarayana Murthy son ruling on officials - Sakshi

అధికారిక కార్యక్రమాలపై అనధికారిక పెత్తనం

అడగడుగునా అధికారులపై అజమాయిషీ

షాడో ఎమ్మెల్యేగా పెందుర్తి ఎమ్మెల్యే కుమారుడు

తండ్రి అసెంబ్లీకి.. తనయుడు పర్యటనలకు..

సాక్షి, విశాఖపట్నం: ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు, కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేల మాదిరిగా అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. అసలై ఒత్తిడితో పనిచేస్తున్న అధికారులు వీరు తీరుతో మనోవేదనకు గురవుతున్నారు. ఓ పక్క ఎమ్మెల్యేలకు మరో పక్క వారి కుటుంబ సభ్యులకు కూడా జీ హుజూర్‌ అంటూ భయపడి ఎంతకాలం విధులు నిర్వర్తిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అధికారులపై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే తనయునిగా పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటే ఎవరు తప్పు పట్టరు కానీ.. అధికారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నింటా పెత్తనం వెలగబెట్టడం విమర్శలకు తావిస్తోంది.

ముదపాక భూముల వ్యవహారంలో కానీ.. నియోజకవర్గంలో జరిగే భూ కబ్జాలు, దందాలపై ఎవరైనా విమర్శిస్తే చాలు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఒంటికాలుపై విరుచుకుపడుతుంటారు. మిత్ర పక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైనా సరే కడిగిపారేస్తుంటారు. తాజాగా తానేమి తీసిపోలేదన్నట్టుగా ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు కూడా షాడో ఎమ్మెల్యే తరహాలో అధికారులపై విరుకుపడుతున్నారు. ఎమ్మెల్యే మాదిరిగా అన్నీ తానై అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... అధికార యంత్రాంగంపై అడుగడుగునా పెత్తనం చలాయిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే చెబితే వింటాం.. ఏదైనా మాట అంటే పడతాం. కానీ ఆయన తనయుడు కూడా చీటికిమాటికి తమపై పెత్తనం చలాయిస్తే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మందు చులకన చేసేలా మమ్మల్ని నిలదీస్తుంటే ఏ విధంగా సమాధానం చెబుతామని వాపోతున్నారు.

తాజాగా ఎమ్మెల్యే బండారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే.. శనివారం అధికారులను వెంటేసుకొని ఆయన తనయుడు పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. సుజాతనగర్‌లోని పలు కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల ఎదుటే వారిని కడిగి పారేశారు. స్థానికులు డ్రైనేజీ సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నారు. నిధులు మంజూరు చేయాల్సింది పోయి.. ఇంకా ఎందుకు పనులు చేపట్టలేదంటూ కాలనీ వాసుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిన్న బుచ్చుకోవడం అధికారులు వంతైంది. ఇలా ఎమ్మెల్యే బండారు లేని రోజుల్లో ఆయన తనయుడు ఇలా సమావేశాలు, సమీక్షల నిర్వహించేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సభావేదిక లెక్కేస్తున్నారు.

ఎమ్మెల్యేల తరహాలో ఉపన్యాసాలిచ్చేస్తున్నారు. సీఎం పర్యటనల్లోనే కాదు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సైతం అన్నింటా తానై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చేస్తున్న పెత్తనం తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయితే తాము పని చేయలేమంటూ వాపోతున్నారు. ఎమ్మెల్యే ఊళ్లో లేనప్పుడు జిల్లా స్థాయి అధికారులు, జెడ్సీ స్థాయి అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెబితే వెళ్లాల్సిన అధికారులు వారు కుమారులు పిలిచినా వెళ్లడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంస్కృతికి అధికారులు బ్రేక్‌ చేయాలని పలువురు కోరుతున్నారు.

Back to Top