బాస్‌ డైరెక్షన్‌.. పోలీస్‌ యాక్షన్‌  

Babu Direction.. Police Action - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  జిల్లాలో ఎన్నికల కోడ్‌ రాకముందే పోలీసు పాలన మొదలైంది. ఇటీవల సర్వేల పేరుతో అనేక బృందాలు జిల్లాలో తిరుగుతుండటంతో అలజడి రేగింది. ఈక్రమంలో గురువారం కూడా బెంగళూరుకు చెందిన పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ గ్రూప్‌ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తోంది. అది కూడా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సమీపంలోనే సర్వే నిర్వహించి ప్రజల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసుకుంటున్నారు.

సర్వే వ్యవహారంపై అనుమానం వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు వీరిని ప్రశ్నించి వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో అప్పగించి వారిపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారిని విచారించకముందే ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ చెంచుబాబు నుంచి ఫోన్లు మొదలయ్యాయి. సర్వే టీమ్‌లోని సభ్యులకు ఆయన నంబర్‌ నుంచి కూడా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. దీంతో పోలీస్‌స్టేషన్‌లో పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది.

సర్వే టీమ్‌ నుంచి ఫిర్యాదు తీసుకొని ఆగమేఘాల మీద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై సీఐ నరసింహారావు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడితే సాయంత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని చెప్పారు. మళ్లీ సాయంత్రం తర్వాత ఫోన్‌ చేసి స్టేషన్‌కు వెళ్లితే 7 గంటలకు అరెస్ట్‌ చూపి కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల వరకు పోలీసులు స్పందిచకపోవటంతో ఎమ్మెల్యే స్టేషన్‌కు వెళ్లి సీఐ తీరును ప్రశ్నించారు.

అరెస్ట్‌ చేసిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరుపర్చకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రాత్రి 1గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ స్టేషన్‌కు తెచ్చారు. వాస్తవానికి ఎలాంటి తప్పు చేయనప్పటికీ పోలీస్‌ అధికారుల ఒత్తిడితో కేసులు నమోదు చేసి దాని కొనసాగింపుగా స్టేషన్లో ఉంచటంపై ఎమ్మెల్యే ఎన్నికల సంఘానికి పూర్తి ఆధారాలతో సీఐ నరసింహరావుపై ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేకు నష్టం చేకూర్చేలా ప్రచారం అధికార పార్టీ నేతలు తెరతీసి నీచ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 

ఇంటెలిజెన్స్‌ డీఎస్పీకి ఏం సంబంధం 

జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌ విభాగాలు పూర్తిగా అధికారపార్టీ అనుకూలంగా పనిచేస్తున్నాయనే విమర్శ పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది. రెండు విభాగాలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా జిల్లాపై సమగ్ర అవగాహన ఉన్న చెంచుబాబును ఎంచుకున్నారు. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా దాదాపు ఏడాది కాలంగా జిల్లాలో పనిచేస్తున్నారు.

గతంలో జిల్లాలో ఎస్సైగా పనిచేశారు.  ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తటస్థంగా ఉన్న రాజకీయ నాయకులను అధికార పార్టీలో చేర్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నారన్న విమర్శలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్‌ డీఎస్పీకు ఉన్న సంబంధం ఏంటనే చర్చ సాగుతోంది.

ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా సర్వేకు డీఎస్పీకి ఉన్న బంధం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ బాస్‌ ఆదేశాలలు, అధికార పార్టీ నేతల ఆదేశాలతో డీఎస్పీ జోక్యం పెరిగిందనే ప్రచారాలు సాగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ రాక ముందు కుట్ర రాజకీయాలకు పోలీసులు సహకరించడం చర్చగా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top