అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు..

Assembly Question Hour  - Sakshi

శిశు మరణాలు తగ్గాయి: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో నవజాత శిశు మరణాలు తగ్గాయని చెప్పారు. ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో గతంలో 39 మంది చనిపోయేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 31కి తగ్గిందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 23 ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని, మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పువ్వాడ అజయ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నలకు లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఏటా 6.5 లక్షల జననాలు నమోదవుతున్నాయని, అందులో లక్ష మందికి ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు.

రోజూ 1.23 కోట్ల లీటర్ల పాల వినియోగం
రాష్ట్రవ్యాప్తంగా 1,23,73,000 లీటర్ల పాల వినియోగం జరుగుతోందని, 1,05,68,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. అవసరానికి సరిపడా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని విజయ డెయిరీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న రెండు లక్షల లీటర్ల నుంచి పది లక్షల లీటర్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, సోలిసేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు.

పహాడీ షరీఫ్‌ అభివృద్ధి: మహమూద్‌ అలీ
రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్‌ హజ్రత్‌ బాబా షర్ఫుద్దీన్‌ దర్గా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దర్గాను ప్రస్తుతం ఉన్న రహదారికి అనుసంధానించేందుకు సీసీ రోడ్డు, విశాలమైన పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అహ్మద్‌ బిన్‌ బలాల, సయ్యద్‌ అహ్మద్‌ ఖాద్రీ, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నలకు మహమూద్‌ అలీ సమాధానం ఇచ్చారు. దర్గాకు ఇప్పటికే రూ.9.6 కోట్లు కేటాయించామని, రెండో దశలో రూ.25 కోట్లతో సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top