బహుళ అంతస్తుల ప్రేమ..!

AP TDP Leader Constructed Buildings By Occupying Lands Illegally In PSR Nellore - Sakshi

  ప్రభుత్వ భూమిని కజ్జా చేసిన టీడీపీ నేత

  పక్కా భవనం నిర్మించినా పట్టించుకోని అధికారులు

  ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం 

సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో టీడీపీ నేత బరితెగింపు హద్దులు దాటింది. ప్రభుత్వ భూములు కజ్జా చేసి పెద్దపెద్ద భవంతులు నిర్మాణం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించి భవంతి నిర్మాణం చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అడ్డుకొనే ప్రయత్నం చేయలేకపోయారు. ఉదయగిరి మండలం కొండాయపాళెం రెవెన్యూ పరిధిలో  గంగిరెడ్డిపల్లి సమీపంలోని సర్వే నంబరు 533/2లో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ మండల స్థాయి నేత మన్నేటి వెంకటరెడ్డి తండ్రి మన్నేటి పాపిరెడ్డి దశాబ్దకాలం క్రితం ఆక్రమించి రేకుల షెడ్‌ నిర్మాణం చేశాడు.

ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఖరీదైన భూమి కావడంతో సదరు టీడీపీ నేత తన తండ్రి ఆక్రమణలో ఉన్న సర్వే నంబర్‌లోనే అదనంగా 0.43 ఎకరాల భూమిని కూడా కజ్జా చేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో మండలంలోని అన్ని  ప్రభుత్వ శాఖల అధికారులు ఆయన కనుసన్నలో పని చేసేవారు కావడంతో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించినా  అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అత్యంత సన్నిహిత నేత కావడంతో రెవెన్యూ అధికారులు సైతం భూకజ్జాపై చర్యలు చేపట్టలేదు. 
ఆక్రమిత భూమిలో భారీ భవంతి నిర్మాణం 
టీడీపీ నేత అక్రమించిన భూమిలో బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించారు. గత ఏడాది కాలంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగానే డీల్‌ కుదిరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లు విలువైన భూమిని కజ్జా చేసి రూ. కోటి విలువైన అక్రమ కట్టడం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తుంది. 
 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
ఇదే నేత మండలంలోని కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు స్థానికులు తెలిపారు. తన బినామీల పేర్లతో రెవెన్యూ రికార్డులను తారు మారు చేయించి సొంతం చేసుకుని జామాయిల్‌ పంట సాగు చేశారని తెలిసింది. ఆయా ప్రభుత్వ భూములకు డీ–ఫారం పట్టాలు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదని తెలిసింది. ఓ పేద రైతు సెంటు భూమి ఆక్రమిస్తే కర్రపెత్తనం చేసే రెవెన్యూ యంత్రాంగం కోట్లు విలువచేసే భూమిని టీడీపీ నేత యథేచ్ఛగా కజ్జా చేసినా అధికారులు మౌనం దాల్చిన తీరు విమర్శలకు తావిస్తోంది
జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..
టీడీపీ నేత భూకజ్జాలపై గతంలో స్థానిక మండలాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేదని ఆయన ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసినా కూడా సదరు టీడీపీ నేత అక్రమితి భూమిలో బహుళ అంతస్తు భవన నిర్మాణం  అధికారులు నిలువరించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేత కావడంతో భూకజ్జాదారుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేశారన్నారు. అదే సన్నకారు రైతు సెంటు భూమిని అక్రమిస్తే వెంటనే దండించే అధికారులకు టీడీపీ నేత భూకజ్జా కనిపించపోవడం దారుణమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top