మీ దగ్గరున్న సెల్‌ఫోన్లు నేనిచ్చినవే 

AP CM Chandrababu Tells That He Gave Cell Phones To The Public - Sakshi

సాక్షి, పుట్టపర్తి అర్బన్‌: ‘‘మీ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లు నేనిచ్చినవే...హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.. బంగారు గుడ్లు పెట్టే విధంగా చేశాను..35 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు...జేబులోనుంచి రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని నిర్మించా..మీరంతా అండగా ఉండి ఆశీర్వదిస్తే అమరావతిని అభివృద్ధి బాట పడిస్తా’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగలో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని నమ్మక ద్రోహం చేశారన్నారు. రూ.లక్ష కోట్లు కొట్టేసిన మోదీ...మన వాటా ఇవ్వకుండా రూ.500 కోట్ల భిక్షం వేశానంటున్నారు. నాకు అవసరం లేదు...కావాలంటే నేనే ఆయనకు రూ.500 కోట్లు భిక్షం వేస్తానన్నారు. ఇక మన లా అండ్‌ ఆర్డర్‌పై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. 24 గంటలు కష్ట పడతానని...సంపద సృష్టించి చూపుతాన్నారు.  

పుట్టపర్తిని తీర్చిదిద్దుతా 
రాబోయే రోజుల్లో పుట్టపర్తిని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 139 చెరువులకు నీళ్లు పారిస్తానంటూ గతంలో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చారు. బుక్కపట్నం చెరువు ముంపు భూములకు పరిహారం ఇస్తామన్నారు. పుట్టపర్తిలో జూనియర్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయిస్తానన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని బ్రాహ్మణులకు, వడ్డెరలకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉదయం 10 గంటలకు పుట్టపర్తికి చేరుకోవాల్సిన సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు రాగా జనం వేచి చూస్తూ అలసిపోయారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top