జగన్‌పై దాడిని అందుకే ఖండించాను: కన్నా

AP BJP President Kanna Laxmi Narayana Fires On Chandrababu Naidu - Sakshi

అమిత్‌ షా, పవన్‌లతో పాటు నాపై కూడా దాడులు

ఆపరేషన్‌ గరుడ చంద్రబాబు సృష్టే

సినీ బ్రహ్మజ్ఞానిని అరెస్ట్‌ చేస్తే అన్ని బయటకొస్తాయి

హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం బాబు హయాంలోనే చూస్తున్నాం

సాక్షి, గుంటూరు : ఏపీలో ప్రతిపక్ష నేతలు ప్రశాంతంగా తిరిగే పరిస్థితులు లేవంటూ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని మానవ జన్మ ఎత్తిన ఎవరైనా ఖండిస్తారు.. అలానే తాను కూడా మానవతా దృక్పథంతోనే ఖండించానని కన్నా తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడే దమ్ము, ధైర్యం బాబుకు లేవని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షనేతలేవరూ ప్రశాంతంగా తిరగే పరిస్థితులు లేవని కన్నా ఆరోపించారు. అమిత్‌ షా, పవన్‌ కళ్యాణ్‌తో పాటు తనపై కూడా దాడికి కుట్రలు చేశారని వెల్లడించారు. ఈ విషయం గురించి గతంలోనే తాను కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యాధితో పాటు బాబుకు భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని  ఖండించడం కూడా తప్పే అంటున్నారని మండిపడ్డారు.

ఆపరేషన్‌ గరుడ బాబు సృష్టే..
రాష్ట్రంలో ఏం జరిగిన టీడీపీ నాయకులు ఆపరేషన్‌ గరుడ అంటున్నారు.. ఎందుకంటే దాని సృష్టి కర్త చంద్రబాబేనని కన్నా ఆరోపించారు. ఒక సినిమా యాక్టర్ చెప్పిన స్క్రిప్ట్‌ని చదివే స్దాయికి సీఎం దిగజారిపోయారని ఆయన విమర్శించారు. ఆ సినిమా నటుడు రాష్ట్రంలో జరిగే విషయాల గురించి నెలల ముందే బ్రహ్మంగారి కాలజ్ఞానంలా చదువుతుంటే మీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఆ బ్రహ్మజ్ఞానిని పట్టుకుని కుట్రలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

సీబీఐ గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదం..
దళిత డీజీపీకి అన్యాయం చేసిన చంద్రబాబు సీబీఐ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సీబీఐలో తన బంధువులను ప్రధాని మోదీ పెట్టుకోలేదని గుర్తు చేశారు. బాబుకు, మోదీకి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఎద్దేవా చేశారు. అలిపిరి దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్ధ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడం తప్పులేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సుసైడ్ నోట్ రాసుకోవడం చూశామని, హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం బాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామంటూ కన్నా ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top