
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వారసుడిగా కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన విధానంలో రెండు పర్యాయాలు యువజన కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యానని, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ టికెట్ అభ్యర్థిస్తున్నానని అనిల్‌కుమార్ అన్నారు. సామాన్య ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగి రాష్ట్రవ్యాప్తంగా యువజన చైతన్యయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా టికెట్ ఆశించడంలో తప్పేంటని ప్రశ్నించారు. బుధవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో తనకు గట్టి పట్టు ఉందని, స్థానిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ఎన్నికల బరిలో దిగి తప్పనిసరిగా విజయం సాధిస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలకు దక్షిణ భారతదేశ బడ్జెట్ చాలదని, నిరుద్యోగభృతి అసలు సాధ్యంకాదని ఇదివరకు పేర్కొన్న కేసీఆర్ తమ మేనిఫెస్టోలోని అంశాలను ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన నిరుద్యోగభృతికి 16 రూపాయలు అదనంగా పెంచి ప్రకటించారని, అదే టీఆర్‌ఎస్ లక్కీ నంబరైతే, ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 16 సీట్లకే పరిమితమవుతుం దని ఆయన జోస్యం చెప్పారు.