
ఆనం రామనారాయణరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని వేచలం క్రాస్ (చీకటి తోట) చేరినప్పుడు పెద్ద ఎత్తున అనుచరులతో తరలివచ్చి ఆయన పార్టీలో చేరారు. అనంతరం రామనారాయణరెడ్డి కొద్దిసేపు వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
పార్టీలో చేరిన అనంతరం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశాయన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రముఖుల్లో ఎన్‌డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్‌యాదవ్, ఏ.ఓబుల్‌రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులున్నారు.