వసుంధరే రాజస్తాన్‌ సీఎం అభ్యర్థి

Amit Shah announces Vasundhara Raje as Rajasthan CM candidate - Sakshi

జైపూర్‌: రాబోయే రాజస్తాన్‌ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధరా రాజేనే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. భారీ మెజారిటీతో గెలిచి ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పారు. జైపూర్‌లో శనివారం ముగిసిన రెండురోజుల రాష్ట్ర బీజేపీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

పేదల అభ్యున్నతి కోసం గత నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని  కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని గడువులోగా(2022 నాటికి) చేరుకుంటామని షా విశ్వాసం వ్యక్తం చేశారు. చివరిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని వసుంధరా రాజే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంటామని చెప్పారు. జైపూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కుమారుడి వివాహానికి షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ హాజరయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top