లోకేష్‌ కాదు.. మాలోకం..

Alla Ramakrishna Comments On Nara Lokesh - Sakshi

మంగళగిరి సమస్యలను ఏరోజైనా పట్టించుకున్నారా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే  

మంగళగిరి/ తాడేపల్లి రూరల్‌: మంత్రి లోకేశ్‌కు ఆ పేరు ఎవరు పెట్టారోగానీ ‘మాలోకం’ అని పెట్టి ఉంటే బాగుండేదని మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎద్దేవా చేశారు. అసలు మంత్రి లోకేశ్‌కు కాడి తెలుసా.. మేడి తెలుసా? రాజకీయాలంటే భూములను లాక్కుని దోచుకోవడం.. పిజ్జాలు బగ్గర్లు తినడమనుకున్నారా అని నిలదీశారు. మంగళగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలవడం అని గుర్తుంచుకోవాలని లోకేశ్‌కు హితవు పలికారు.

నిద్రలేచినప్పటి నుంచి ‘మేము ఇక్కడే ఉంటున్నాం.. మా ఓట్లు ఇక్కడే ఉన్నాయి’ అని చెబుతున్న లోకేశ్‌.. అసలు ఆయన తండ్రి చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమమా.. సక్రమమా అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆక్రమించుకుని ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఉంటున్న తండ్రీకొడుకులు ఏనాడైనా మంగళగిరి ప్రజల సమస్యలను పట్టించుకున్నారా? అని నిలదీశారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రైతుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పి ప్రభుత్వం భూసేకరణ నోటీసులిస్తే పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరిలో పోటీ చేస్తారని తాను భావించానని, కానీ ఆ పార్టీ బరిలోకే దిగకపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. అలాగే తాడేపళ్లిలోని తన కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అసలు మంగళగిరి నియోజకవర్గం గురించి లోకేశ్‌కు ఏం తెలుసో చెప్పాలి సవాల్‌ విసిరారు.

నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడానికి వచ్చి పొన్నూరు వరకు వెళ్లి వెనక్కు తిరిగి వచ్చిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఒక్క ఇల్లు తొలగించడానికి కూడా తాము నోటీసులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం ఇచ్చిందంటూ నారా లోకేశ్‌ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే నోటీసు ఇవ్వలేదని బహిరంగ చర్చకు రావాలని, తాము కూడా సీతానగరం వచ్చి నోటీసులు ఇచ్చారో, లేదో చూపిస్తాం అని ఎమ్మెల్యే ఆర్కే సవాల్‌ విసిరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top