బస్సు రెడీ.. నేతలూ రెడీ.. | All set for congress bus trip | Sakshi
Sakshi News home page

బస్సు రెడీ.. నేతలూ రెడీ..

Feb 25 2018 1:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

All set for congress bus trip  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 26 నుంచి తలపెట్టిన ‘బస్సుయాత్ర’కు సర్వం సిద్ధమవుతోంది. యాత్ర విజయవంతం కోసం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో సలహా కమిటీ, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ సారథ్యంలో ఆర్గనైజింగ్‌ కమిటీ, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి చైర్మన్‌గా ఆర్థిక కమిటీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆధ్వర్యంలో మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలలో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఈ కమిటీల ఏర్పాటుతోపాటు యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 40 సీట్ల వోల్వో బస్సు కూడా సిద్ధమయింది. నాలుగువైపులా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాల బొమ్మలతో ఈ బస్సు తయారైంది. బస్సుతోపాటు రెండు ప్రచార రథాలను సిద్ధం చేశారు.

ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి దానం నాగేందర్, ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, బస్సుయాత్ర కోసం ఏర్పాటు చేసిన కమిటీలలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిలలో ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

ఫేస్‌బుక్‌ లైవ్‌
బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఆ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ లైవ్‌ ప్రోగ్రాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ కేడర్‌తో ఆయన మాట్లాడారు. బస్సుయాత్ర చేయాల్సిన ఆవశ్యకతతో పాటు పార్టీ ఉద్దేశాన్ని కేడర్‌కు ఆయన వివరించారు. ఉత్తమ్‌ నిర్వహించిన ఈ ఫేస్‌బుక్‌ లైవ్‌కు విశేష స్పందన లభించిందని, మానకొండూరు, నారాయణ్‌ఖేడ్, జడ్చర్ల, కామారెడ్డి, ఖాజీపేట, హైదరాబాద్‌కు చెందిన పలువురు కార్యకర్తలు, ప్రజలు ఉత్తమ్‌తో తమ సమస్యలు, అనుభవాలను పంచుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, బస్సుయాత్ర ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం నుంచి సర్వమత పూజలు నిర్వహించనున్నారు. నాంపల్లి దర్గా, ఆరెమైసమ్మ దేవాలయం, మొయినాబాద్‌ చర్చిలలో పూజలు నిర్వహించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేవెళ్లలో యాత్ర ప్రారంభించనున్నారు. తొలి దశలో మూడు రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement