‘మా నాన్న ఎన్నికల్లో పోటీ చేయరు’

Ajit Jogi will not contest Chhattisgarh assembly polls, says son Amit Jogi - Sakshi

రాయ్‌పూర్‌: మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ (జేసీసీ) నాయకుడు అజిత్‌ జోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అమిత్‌ జోగి వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రచారంపైనే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. బహుజన​ సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐతో కలిసి జేసీసీ మహాకూటమి ఏర్పాటు చేసిందన్నారు.

‘ఆయన (అజిత్‌ జోగి) రాష్ట్రమంతా ప్రచారం చేయడంపైనే దృష్టి పెడతారు. మహాకూటమి అభ్యర్థులందరి తరపున ప్రచారం సాగిస్తారు. ఎన్నికల్లో ఆయన పోటీ చేయరు. పార్టీ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమ’ని అమిత్‌ జోగి చెప్పారు. (చదవండి: మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!)

జేసీసీతో కలిసి పోటీ చేయనున్నట్టు సెప్టెంబర్‌ 20న బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మొత్తం 90 స్థానాల్లో జేసీసీ 55, బీఎస్పీ 35 చోట్ల పోటీ చేస్తాయని మాయావతి తెలిపారు. జేసీసీ 45 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. గత ఆదివారం సీపీఐ కూడా చేరడంతో కొంతా, దంతెవాడ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వనున్నట్టు అజిత్‌ జోగి ప్రకటించారు. బస్తర్‌ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆయన ఎన్నికల ప్రచారం సాగించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top