మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!

Mayawati Goes With Ajit Jogi In Chhattisgarh, Congress Left Alone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలతో కలసి మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ పార్టీ వ్యూహానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగి నాయకత్వంలోని చత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నామంటూప బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రకటించడమే కాకుండా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి 22 మంది పార్టీ సభ్యుల జాబితాను కూడా విడుదల చేయడం అనూహ్య పరిణామం. ఓ పక్క మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం శోచనీయమే.

2016లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కృతుడై చత్తీస్‌గఢ్‌ జనతాపార్టీని ఏర్పాటు చేసిన అజిత్‌ జోగితో తన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మాయావతి ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకని అది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌తో ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే 22 మంది పార్టీ సభ్యుల పేర్లను ప్రకటించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి తన పార్టీ కోసం 50 సీట్లను డిమాండ్‌ చేస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ 30 సీట్లకు మించి ఇవ్వనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మాయావతి జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశం అయింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్‌గఢ్‌లో మాయావతిని జట్టులో నుంచి పోనీయకుండా చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండి ఉంటే అలా జరగనిచ్చే వారు కాదని, ఆమె కుమారుడైన రాహుల్‌ గాంధీకి అంత రాజకీయ పరిణతి లేకపోవడం వల్ల అలా జరిగిందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. దీని ప్రభావం మధ్యప్రదేశ్‌ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కచ్చితంగా ఆ రాష్ట్రంలో పొత్తు కుదురుతుందని కమల్‌నాథ్‌ లాంటి సీనియర్‌ నాయకులే విశ్వసిస్తున్నారు. అది నిజమే కావచ్చుకానీ వివిధ సామాజిక వర్గాల మద్దతును కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం పలు ప్రాంతీయ పార్టీల బలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది.

వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోని కాంగ్రెస్‌ పార్టీకి పొత్తు కుదరకుండా ఆయా పార్టీలపై పాలకపక్ష బీజేపీ అన్ని రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ పరిణామం కాంగ్రెస్‌కు ప్రతికూలమే. పాలకపక్ష బీజేపీకి, కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు తేడా ఉన్న చత్తీస్‌గఢ్‌లో తృతీయ ఫ్రంట్‌ రావడం అంటే పాలకపక్షం బీజేపీకీ మేలు చేయడమే. మూడవ పర్యాయం ముఖ్యమంత్రి రామన్‌ సింగ్‌కు మళ్లీ పట్టం కట్టడమే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top