సిగ్గుంటే సీవీసీని తొలగించండి: సింఘ్వీ

Abhishek Manu Singhvi Comments On Modi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రమైనా సిగ్గు అనేది ఉంటే వెంటనే కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) కేవీ చౌదరిని బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం డిమాండ్‌ చేసింది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు కేంద్ర సీవీసీని కీలుబొమ్మగా వాడుకుంటోందని ఆరోపించింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో ప్రభుత్వానికి భాగస్వామిగా ఉన్న సీవీసీని పదవి నుంచి తొలగించాలి. అతను కచ్చితంగా వెళ్లిపోవాలి. ఆయనే రాజీనామా చేస్తారో లేక ప్రభుత్వం సాగనంపుతుందో, ఆయన కచ్చితంగా వెళ్లిపోవాలి. ప్రధానికి లేదా ఆయన ప్రభుత్వానికి కనీసం కొంచెమైనా సిగ్గు మిగిలి ఉంటే, సీవీసీ బర్తరఫ్‌ అవ్వాలి.

ఆయనను తొలగించాలి లేదా సీవీసీయే రాజీనామా చేయాలి’అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీవీసీ సిఫారసుల మేరకు సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి అలోక్‌ వర్మను ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తొలగించడం తెలిసిందే. రఫేల్‌పై విచారణను తప్పించుకునేందుకే సీవీసీని కేంద్రం కీలుబొమ్మగా మార్చుకుందని సింఘ్వీ అన్నారు. ‘సీబీఐ కేంద్రం పంజరంలోని చిలక అని మనం ఇప్పటివరకు విన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కొత్తగా ‘నిఘా’ బానిసగా ఉంటున్న వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు అంబాసిడర్‌గా, అస్థానా తరఫున సంప్రదింపులు చేసే వ్యక్తిలా సీవీసీ వ్యవహరించారు. ప్రభుత్వ కుట్రలను అమలు చేసే ఏజెంట్‌లా కూడా ఆయన ప్రవర్తించారు. ప్రజాప్రయోజనార్థం తాను నిఘా పెట్టాలన్న విషయాన్ని మరిచి, రాజకీయ నేతల నిఘా కీలుబొమ్మగా ఆయన మారారు’ అని అభిషేక్‌ సింఘ్వీ ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top