నియోజకవర్గం నుంచి 100 మంది

100 people from the constituency - Sakshi

     ప్లీనరీకి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం 

     12 వేల నుంచి 15 వేల మంది హాజరయ్యే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఆహ్వానించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 100 మంది వరకు వివిధ స్థాయి ల్లోని పార్టీ నేతలను ఆహ్వానించనున్నారు. ఆహ్వానితుల జాబితాను ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థ, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు, రీజినల్‌ మహిళా ఆర్గనైజర్లను ఈ ప్లీనరీకి ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా 12 వేల నుంచి 15 వేల మంది హాజరుకానున్నారు.  

9 కమిటీలు.. 
ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ కమిటీల్లో ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరుగురితో ఏర్పాటు చేసిన తీర్మానాల కమిటీతో కలుపుకుని.. మొత్తంగా 9 కమిటీల బాధ్యులు, తమకు అప్పగించిన పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగారు.  

పకడ్బందీ ఏర్పాట్లు 
టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్కింగ్, ప్రతినిధుల నమోదు, భోజనాలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా సాంçస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతించిన ప్రాంతాల్లో హోర్డింగులు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్లీనరీ ఆహ్వానితులు ఈనెల 27న ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి సూచించారు. 

ప్లీనరీ నిర్వహణ కమిటీలివి.. 
తీర్మానాల కమిటీ: కె.కేశవరావు(పార్లమెంటరీ పార్టీ నేత) 
ఆహ్వాన కమిటీ: పట్నం మహేందర్‌ రెడ్డి (రవాణా శాఖ మంత్రి), సీహెచ్‌ మల్లారెడ్డి (ఎంపీ) 
సభా ప్రాంగణం, వేదిక: గ్యాదరి బాలమల్లు (టీఎస్‌ఐఐసీ చైర్మన్‌), శంభీపూర్‌ రాజు (ఎమ్మెల్సీ)  
ప్రతినిధుల నమోదు, పార్కింగ్‌: కె.పి.వివేకానంద గౌడ్‌ (ఎమ్మెల్యే), ఎం.సుధీర్‌ రెడ్డి (ఎమ్మెల్యే), సీహెచ్‌ కనకారెడ్డి (ఎమ్మెల్యే) 
నగర అలంకరణ: బొంతు రామ్మోహన్‌ (జీహెచ్‌ఎంసీ మేయర్‌) 
వలంటరీ కమిటీ: మైనంపల్లి హన్మంతరావు (ఎమ్మెల్సీ), బాబా ఫసీయుద్ధీన్‌ (జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌), చిరుమళ్ల రాకేశ్‌(టీఎస్టీఎస్సీ చైర్మన్‌) 
భోజన కమిటీ: మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే) 
మీడియా కో ఆర్డినేటర్లు: బాల్క సుమన్‌ (ఎంపీ), కర్నె ప్రభాకర్‌ (ఎమ్మెల్సీ), మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి 
సాంస్కృతిక కమిటీ: రసమయి బాలకిషన్‌ (సాంస్కృతిక సారథి చైర్మన్‌)   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top