అత్తను చంపిన అల్లుడు | aunt killed by son in law at Pegadapalli | Sakshi
Sakshi News home page

అత్తను చంపిన అల్లుడు

Feb 6 2018 5:47 PM | Updated on Sep 2 2018 4:40 PM

aunt killed by son in law at Pegadapalli - Sakshi

నర్సవ్వ (ఫైల్‌)

పెగడపల్లి: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడే అత్తను చంపిన సంఘటన పెగడపల్లి మండలం లింగాపూర్‌లో ఆదివారం జరిగింది. లింగాపూర్‌కు చెందిన శనగరపు నర్సవ్వ(70) అల్లుడు దుంపటి కొమురయ్య తన భార్య గంగవ్వను కాపురానికి పంపడం లేదని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాలు. నర్సవ్వ భర్త మల్లయ్య చనిపోయాడు. తన కూతురు గంగవ్వ వివాహం మండలంలోని సుద్దపల్లికి చెందిన దుంపటి కొమురయ్యతో 25 ఏళ్ల క్రితం జరిపించింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. కొమురయ్య భార్య గంగవ్వ, కూతుళ్లను వేధిస్తుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టుకుని పదేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో తిరిగి ఐదేళ్ల క్రితం భార్యభర్తలు కలిసి ఉంటూ వారి కూతుళ్లకు వివాహాలు కూడా చేశారు. కొంతకాలంగా గంగవ్వను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిగారి ఊరు లింగాపూర్‌కు వచ్చి తల్లి నర్సవ్వతో ఉంటుంది.

ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన కొమురయ్య తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉన్నాడు. భార్యను కాపురానికి పంపకుంటే చంపుతానని బెదిరించేవాడు. ప్రాణభయం ఉందనే భయంతో గంగవ్వ బంధువుల ఇంట్లో నిద్రిస్తుంది. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి వచ్చిన కొమురయ్య నిద్రిస్తున్న అత్త నర్సవ్వ తలపై రోకలిబండతో బాది హత్య చేశాడు. హత్యా జరిగిన ప్రదేశాన్ని జగిత్యాల డీఎస్పీ భధ్రయ్య సందర్శించి, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు జరిపించారు. మృతురాలి కూతురు గంగవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేందర్‌ తెలిపారు. పెగడపల్లి ఎస్సై జీవన్‌ ఉన్నారు.     
 

Advertisement
 
Advertisement
Advertisement