దళిత జన ‘భాగ్య’ విధాత | Varma Bhagya's Reddy birth on May 22 | Sakshi
Sakshi News home page

దళిత జన ‘భాగ్య’ విధాత

May 21 2015 12:42 AM | Updated on Oct 8 2018 9:06 PM

దళిత జన ‘భాగ్య’ విధాత - Sakshi

దళిత జన ‘భాగ్య’ విధాత

అంటరాని కులాలు పేదరికంలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడానికి అవిద్యే ప్రధాన హేతువని ఆయన గుర్తించారు.

కొత్త కోణం
 
అంటరాని కులాలు పేదరికంలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడానికి అవిద్యే ప్రధాన హేతువని ఆయన గుర్తించారు. అందుకే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ (1911)ను నెలకొల్పి తన ఆశయానికి కార్యరూపం ఇచ్చారు. అంటరాని కులాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు, హిందూ ఛాందసవాదులు పిలిచే ‘పంచములు’ అనే పేరు అవమానకరంగా ఉన్నాయని భావించి, అంటరాని కులాలన్నింటినీ కలిపి ఆదిహిందూ అనే పేరుతో పిలవాలని వాదించి ప్రభుత్వాలను ఒప్పించారు. తరువాత మద్రాసు, నిజాం ప్రభుత్వాలు అదే పదం ప్రయోగించడం విశేషం.
 
లండన్ మహానగరాన్ని 16-19 శతాబ్దాల మధ్య ఎన్నోసార్లు ప్లేగువ్యాధి కబళించింది. మూడోవంతు ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి వ్యాపిం చకుండా నగరంలోని అనేక ఇళ్లను తగులబెట్టారని చరిత్ర చెబుతోంది. అటు వంటి ప్లేగు మహమ్మారి 1910 నుంచి 1945 వరకు దాదాపు పద్దెనిమిదిసార్లు భాగ్యనగరం మీద దాడి చేసింది. 1917 నుంచి 1933 వరకు ఏటా వేలాది మంది ప్లేగుకు బలయ్యారు. 1911-12లలో 16,654 మంది, 1916-17లలో 13,579 మంది ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. భయంకర మైన ఈ అంటువ్యాధిని లెక్కచేయక శవాల గుట్టల మధ్య ఓ చైతన్య యువ సైన్యం స్వచ్ఛంద సేవకు పూనుకుంది. ఆ యువసేనకు నాయకుడే మాదరి భాగ్యరెడ్డివర్మ (మే 22, 1888- ఫిబ్రవరి 18, 1939). భాగ్యనగర చరిత్రలో, దక్కన్ భూమిలో దళిత పోరాట కెరటం.
  ప్లేగు మిగిల్చిన మానవ కళేబరాలను సేకరించడం, గుట్టలుగా పోసి దహన సంస్కారాలు నిర్వహించడంలో చాలా మంది సంఘసేవకులు పాలు పంచుకున్నారు. అందులో ప్రప్రథమ వరుసలో నిలిచింది మాత్రం భాగ్యరెడ్డి వర్మ, అతని అనుచరులే. ఆ వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయాన్నందించడం లోనూ ఆ దళాలు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. వారి కృషినీ, సేవా తత్పరతనూ నైజాం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అభినం దించింది. అదే సాహసం, అదే సేవాగుణం, దళిత పోరాట దీపిక మరెన్నో సామాజిక ఉద్యమాలకు అంకురార్పణ చేసింది. హైదరాబాద్ నగరంలో కుల అణచివేత, అంటరానితనానికి వ్యతిరేకంగా డా.బి.ఆర్.అంబేడ్కర్ కన్నా ముందుగా గళమెత్తిన మహాదార్శనికుడు భాగ్యరెడ్డి వర్మ.

హైదరాబాద్ నగరంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు భాగయ్య. వెంకయ్య, రంగమాంబల రెండవ సంతానం. ఆ కుటుంబ గురువు శైవమతానికి చెందినవాడు. ఆయన భాగయ్యకు బదు లుగా భాగ్యరెడ్డి అని పిలిస్తే బాగుంటుందని సూచించారు. రెడ్డి అంటే పాల కుడు అని అర్థం. ప్రస్తుతం అంటరాని కులాలుగా ఉన్న మాల, మాదిగలు గతంలో ఈ దేశాన్ని పాలించారనీ, అందువల్ల భాగయ్య పేరులో రెడ్డి అనే పదం చేర్చాలని గురువు చెప్పిన మాటను తల్లిదండ్రులు పాటించారు. భాగ్య రెడ్డి సామాజిక సేవను గుర్తించి 1913లో ఆర్య సమాజం వర్మ అనే బిరుదుతో సత్కరించింది. అలా మాదరి భాగ్యరెడ్డి వర్మ చరిత్రలో ఆవిర్భవించారు.

భాగ్యరెడ్డి వర్మ ఆరుగురు సంతానంలో ఒకరు కావడంతో పెద్ద చదువు లకు అవకాశం రాలేదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోగా, తల్లి అన్నీ తానై పెం చింది. మొండిగా ప్రవర్తించే భాగ్యరెడ్డి తల్లి కోప్పడడంతో ఒకరోజు ఇల్లు వది లివెళ్లాడు. రాములుగా పేరు మార్చుకొని టెన్నిస్ కోర్టులో బంతిని అందించే బాయ్‌గా చేరాడు. రోమన్ క్యాథలిక్ సోదరులైన ఇద్దరు న్యాయవాదులు భాగ్యరెడ్డిని చేరదీసారు. అక్కడే ఆయన చదవడం, రాయడం నేర్చుకున్నారు. తర్వాత పెళ్లి, ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం-చకచకా జరిగిపోయాయి. ఇవి అం దరి జీవితాలలోనూ జరిగేవే. కానీ భాగ్యరెడ్డి నిర్వహించిన పాత్ర, చూపిన మార్గం సామాజిక ఉద్యమాల చరిత్రలోనే విశిష్టతను సంతరించుకున్నది.

అంటరాని కులాలు పేదరికంలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడానికి అవిద్యే ప్రధాన హేతువని ఆయన గుర్తించారు. అందుకే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ (1911) అనే సంస్థను నెలకొల్పి తన ఆశయానికి కార్యరూపం ఇచ్చారు. అంటరాని కులాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు, హిందూ ఛాందసవా దులు పిలిచే ‘పంచములు’ అనే పేరు అవమానకరంగా ఉన్నాయని భావించి, భాగ్యరెడ్డి అంటరాని కులాలన్నింటినీ కలిపి ఆది హిందూ అనే పేరుతో పిల వాలని వాదించి ప్రభుత్వాలను ఒప్పించారు. తరువాత మద్రాసు, నిజాం ప్ర భుత్వాలు ఆదిహిందువులు అనే పదం ప్రయోగించడం విశేషం. మొట్టమొ దట 1910లో ఇసామియా బజార్ (హైదరాబాద్)లో అంటరాని వర్గాలకు ప్రాథ మిక పాఠశాలను స్థాపించారు. 1933 నాటికి ఆదిహిందూ పాఠశాలలు దాదా పు 2,500 మంది విద్యార్థులతో 26కి పెరిగాయి. తొలిదశలో దక్కన్ హ్యూమన్‌టేరియన్ లీగ్ ఈ పాఠశాలల నిర్వహణకు సహకారాన్ని అందిం చేది. ఈ విద్యాకార్యక్రమాలు నిర్వహించడానికి వ్యక్తిగతంగా సహకరించిన వారిలో చాలామంది అంటరాని కులాలవారే. అప్పటి హైకోర్టు న్యాయమూర్తి బాలముకుంద్‌రాయ్, ధర్మవీర్ వామన్‌నాయక్ జాగిర్దార్, రాజాప్రతాప్ గిరి జీ, న్యాయమూర్తి ఆర్.ఎస్.నాయక్‌లు కూడా ఇందుకు అండగా నిలిచారు.

పాఠశాలల సంఖ్య పెరగడంతో, వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని భాగ్యరెడ్డి కోరారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడు పాఠశాలలన్నీ ఉర్దూ మీడియంలోనే నడుస్తున్నాయి. కానీ భాగ్యరెడ్డి ఈ పాఠశాలలను మాత్రం తెలుగు మీడియంలోనే నడపాలనీ, చదువుతో పాటు చేతివృత్తుల శిక్షణను కొనసాగించాలనీ రెండు షరతులు పెట్టారు. దానికి నిజాం ప్రభుత్వం అంగీకరించి 1934లో ఆ పాఠశాలను స్వాధీనం చేసుకున్నది. ఇప్పటికీ చాదర్‌ఘాట్‌లో భాగ్యరెడ్డి ప్రారంభించిన బాలికల పాఠశాల ఎయిడెడ్ పాఠశాలగా కొనసాగుతున్నది. మలక్‌పేట నుంచి చాదర్ ఘాట్ బ్రిడ్జి దాటుతూ చూస్తే కనిపించే ఆది హిందూ భవన్ నాటి చరిత్రకు తార్కాణం. కేవలం పుస్తక పరిజ్ఞానం కాకుండా, నైపుణ్యాన్ని తీర్చిదిద్దే వృత్తి విద్య అత్యవసరమనే విషయాన్ని 1933లోనే భాగ్యరెడ్డి సూచించడం ఆయన దార్శనికతకు నిదర్శనం. విద్యారంగంలో గీటురాయిగా భావించే కొఠారి కమి షన్ 1966లో ఇదే విషయాన్ని ప్రతిపాదించింది.

భాగ్యరెడ్డి వర్మ భారతదేశంలోనే ఒక అరుదైన సామాజిక ఉద్యమ నాయకుడు. అంటరాని కులాల్లో చైతన్యాన్ని రగిలించడానికి జగన్ మిత్రమం డలిని (1906)స్థాపించారు. దాని ద్వారా యువకులకు అంటరానితనంపై అవగాహన కలిగించడం, భజనలు చేయించడం వంటి పనులు చేసేవారు. 1912 వచ్చేసరికి వాటిని మన్య సంఘాలుగా మార్చారు. వీటిని చాలామంది మాన్యసంఘంగా భావిస్తున్నారు. కానీ మన్యసంఘం మాల కంటే ముం దున్న పేరు. అదే మన్నె, మన్య. అది క్రమంగా మాలగా మారింది. అందుకే భాగ్యరెడ్డి వర్మ మన్య అనే పదానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికీ తెలంగా ణలోని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాలలను ‘మన్నెపోల్లు’ అని పిలుస్తారు. 1922 మార్చి, 29, 30,31 తేదీల్లో అఖిల భారత ఆది హిందూ సాంఘిక సంస్కరణ సదస్సు సందర్భంగా మన్య సంఘం పేరు కేంద్ర ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా రూపొందింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ ఆది హిందూ భవన్ కేంద్రంగా పనిచేస్తున్నది.

భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులను వెనుకబాటుతనం నుంచి విముక్తం చేయడానికి వారు తయారు చేసిన ఉత్పత్తులను, వస్తువులను మార్కెట్ చేయ డానికి ఎగ్జిబిషన్ పెట్టాలనే ఆలోచనకు 1925లోనే వచ్చారు. ఆ సంవత్సరమే తొలిసారి సికింద్రాబాద్‌లోని ప్రేమ్ థియేటర్‌లో (రెసిడెన్షియల్ బజార్) ఆది హిందువుల చేతివృత్తుల ప్రదర్శన జరిగింది. ఇందులో పెయింటింగ్‌లు, స్కెచ్‌లు, శిల్పాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించారు. ఒకవైపు ఆది హిందు వులను చైతన్యపరుస్తూనే, మరోవైపు హిందూ సమాజంలోని ప్రగతిశీలవాదు లతో కలిసి పనిచే స్తూ, వారిని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌కు అధ్యక్షులు, కార్యదర్శులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు. దానితో ఆది హిందూ ఉద్యమానికి హిందూ అగ్రకులాల, ప్రజాస్వామ్యశక్తుల మద్దుతు లభిం చింది. నాటి హైకోర్టు న్యాయమూర్తి బాలముకుంద్‌రాయ్ తన శవానికి దహన సంస్కారాలు జరిపే హక్కు ఆది హిందువులకే ఉన్నదని ప్రకటించారు కూడా. భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలోనే ఆ కార్యక్రమం జరిగింది.

అప్పటి మద్రాసు రాష్ట్రంలోని విజయవాడలో మొట్టమొదట జరిగిన అంటరాని కులాల సదస్సుకు (1917) భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. అనంతపురం, కాకినాడ ప్రాంతాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ భాగ్యరెడ్డి వర్మ చాలా విస్తృతంగా పర్యటించారు. జాతీయ స్థాయిలో ఆయన నిర్వహించిన పాత్ర కూడా అంటరాని కులాల ఉద్యమానికి ఎంతో శక్తినిచ్చింది. 1931, డిసెంబర్ 27, 28 తేదీల్లో లక్నోలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ సదస్సుకు కూడా భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, రావు బహద్దూర్ శ్రీనివాస్‌ను పంపాలనే తీర్మానం ఈ సదస్సులోనే ఆమోదించారు. మహాత్మాగాంధీ ఏప్రిల్ 7, 1929న ఆది హిం దూ పాఠశాలలను సందర్శించి, భాగ్యరెడ్డి వర్మను ప్రశంసించారు.  భాగ్యరెడ్డి వర్మ తన 51వ ఏట ఫిబ్రవరి 18, 1939న క్షయవ్యాధితో మరణించాడు. ఆయన మరణం ఆది హిందూ ఉద్యమానికీ, అంటరాని కులాల అభివృద్ధికీ విఘాతమే. అయితే దళితాభ్యుదయానికి ఆయన వేసిన పునాదులు నేటికీ పదిలంగానే ఉన్నాయి. తొలితరం దళితోద్యమనాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. (22 మే భాగ్యరెడ్డి వర్మ జయంతి)

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
మల్లెపల్లి లక్ష్మయ్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement