
బెంగళూరు: పాఠశాల టాయిలెట్‌లో 9వ తరగతి బాలిక బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం షాహాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన బయటకు పొక్కగానే అప్రమత్తమైన కర్ణాటక విద్యా సంస్థల సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాంతరాజు సదరు పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, సైన్స్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌లను సస్పెండ్ చేశారు.
షాహాపూర్ పోలీస్ స్టేషన్‌కు అందిన ఫిర్యాదు ప్రకారం ఈ సంఘటన కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని షాహాపూర్ తాలూకాలో జరిగింది. స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల టాయిలెట్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక గర్భవతి అనే విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 17 ఏళ్ల ఆ విద్యార్థిని తొమ్మిది నెలలపాటు గర్భాన్ని మోసి, బిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా బాలల రక్షణ అధికారి నిర్మల షాహాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
డిప్యూటీ కమిషనర్ హర్షల్ భోయార్ ఈ ఘటనపై స్పందిస్తూ, అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. కాగా బాల్య వివాహానికి సంబంధించిన అనుమానాలతో పాటు వివిధ కోణాల నుండి ఈ కేసును పరిశీలిస్తున్నామన్నారు. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కమిషన్ సభ్యుడు శశిధర్ మాట్లాడుతూ పాఠశాలలోని సిబ్బంది తప్పనిసరి తనిఖీలను విస్మరించిందని ఆరోపించారు. హాస్టళ్లలోని విద్యార్థినులకు నెలవారీ ఆరోగ్య, రుతు పరీక్షలను నిర్వహించాల్సివున్నా పాఠశాల యాజమాన్యం అలాంటి పద్ధతిని పాటించలేదన్నారు. కాగా ఆ విద్యార్థిని, ఆమె శిశువు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కమిషన్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.