జీతమడగని కాపలాదారు... | no salary for The doorman | Sakshi
Sakshi News home page

జీతమడగని కాపలాదారు...

Jun 28 2014 12:10 AM | Updated on Sep 2 2017 9:27 AM

జీతమడగని కాపలాదారు...

జీతమడగని కాపలాదారు...

జూకంటి జగన్నాథం దాదాపు తన పాతికేళ్ల సుదీర్ఘ కవి జీవితంలో ఏనాడూ కంటి మీద రెప్ప వేయలేదు. చేతి నుంచి లాఠీ జారవిడువలేదు.

సమగ్ర సంపుటి
 

రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్ 
శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్
నీతికి చెదలు పట్టింది
ధర్మాన్ని చీడ ముట్టింది
వాళ్లు వీళ్లు అనే భేదం లేదు
దేశాన్ని తెగనమ్మడంలో
అంతా సమానమే
నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతరు
ఏడ్చుకుంటనే ఊర్లకు అగ్గిపెడుతరు
అంతా హర్ ఏక్ మాల్
నదులకు టెండర్లు పిలుస్తారు
నీరు అడుగంటుతే
ఇసుకకు బ్యారం పెడతరు....

జూకంటి జగన్నాథం దాదాపు తన పాతికేళ్ల సుదీర్ఘ కవి జీవితంలో ఏనాడూ కంటి మీద రెప్ప వేయలేదు. చేతి నుంచి లాఠీ జారవిడువలేదు. ఏమరుపాటు కలిగించే విజిల్‌ని కూడా. ఆయన ఎవరూ ఇవ్వని కాపలాదారు పోస్టును స్వీకరించారు. ఒక నిజమైన కవి పని అదే. జీతభత్యాలు లేకుండా జనం కోసం ముందుకు నడవడం. తెలంగాణ నుంచి జూకంటి అంత విస్తృతంగా రాసిన కవి లేడు. ఆయనంత విస్తృత వస్తువును స్వీకరించిన కవి కూడా లేడు. ఊరు, వాడ, పట్నం, నగరం, వలస వెళ్లిన ఎడారి ప్రాంతం, డాలర్లకు కొనేసుకున్న స్వర్ణపిశాచినగరం... ఇవన్నీ ఆయన కవితా వస్తువులు. జూకంటి తన కవిత్వం మొత్తంలో రెండు అంశాలను నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఒకటి- కొంటున్నది ఎవరు? అమ్ముడుపోతున్నది ఎవరు? ఈ దేశపటం ముందు ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ బోర్డు తగిలించడం వల్ల నలిగి నాశనమైపోతున్నది ఎవరు?

జూకంటి కవిత్వంలో పచ్చిపాల వంటి స్వచ్ఛత, ర్యాలాకు మంటల్లో కాల్చిన సీతాఫలం కాయల రుచి ఎలాగూ ఉంటుంది. కాని ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేది ప్రపంచ పరిణామాల అవగాహన, ఎక్కడో కమ్ముకున్న మేఘానికి ఇక్కడ జరగబోయే విధ్వంసం. దానిని పసిగట్టి, రాసి, పారాహుషార్ పారాహుషార్ అంటూ అరిచి నిద్ర మేల్కొలిపే పనిలో ఉండిపోయిన కవి జూకంటి.

చుట్టూ చావువాసన
సన్నగా నిశ్శబ్దిస్తున్న శోకం
దోషం మనదే రేషం మనదే
కొడుకా... అమలవుతున్న ఎజెండా
అంతా ఏనుగు మింగిన వెలగపండు....

జూకంటి ఇప్పటికి 12 కవితా సంపుటులు వెలువరించారు. పాతాళ గరిగె (1993) నుంచి చిలుక రహస్యం (2012) వరకు... అన్నీ అలారం మోతలే. కొన్ని టార్చ్‌లైట్‌లు. కొన్ని సేదదీర్చే చన్నీటి కుండలు. ఆ కవిత్వమంతా ఇప్పుడు మూడు సంపుటాలుగా వెలువడింది. ఇది తెలుగు కవిత్వానికి మంచి చేర్పు. జూకంటి సృజనను మూల్యాంకనం చేయవలసిన సమయం. ఇంత రాసినందుకు ఆయనకు ఏమి ప్రతిఫలం కావాలి? ఏం లేదు. సమాజం నుంచి కాసింత జాగరూకత. చాలు. జీతం అకౌంట్‌లో పడిపోయినట్టే.

 - సాక్షి సాహిత్యం

 జూకంటి జగన్నాథం కవిత్వం (మూడు సంపుటాలు); నయనం ప్రచురణ; వెల- 300;
 ప్రతులకు- 9441078095
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement