హస్తినపై ‘కేజ్రీ’ ఇంద్రజాల్ | kejriwal magic in delhi elections | Sakshi
Sakshi News home page

హస్తినపై ‘కేజ్రీ’ ఇంద్రజాల్

Dec 11 2013 11:49 PM | Updated on Aug 20 2018 3:46 PM

హస్తినపై ‘కేజ్రీ’ ఇంద్రజాల్ - Sakshi

హస్తినపై ‘కేజ్రీ’ ఇంద్రజాల్

ఇటీవల జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజ కీయాలపై అత్యంత ప్రాముఖ్యత గలిగిన, దిగ్భ్రాంతి కరమైన ప్రభావాన్ని నెరపాయి, నెరపనున్నాయి.

విశ్లేషణ, డా॥పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు
 
 ఇటీవల జరిగిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజ కీయాలపై అత్యంత ప్రాముఖ్యత గలిగిన, దిగ్భ్రాంతి కరమైన ప్రభావాన్ని నెరపాయి, నెరపనున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో సృష్టించిన అద్భుతాలు ప్రత్యేకించి బల మైన ప్రభావాన్ని కలుగజేశాయి. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని అసాధారణ విజయాలను ఆమ్‌ఆద్మీ సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ ఫలితాల నుంచి చేదు గుణపాఠాలను నేర్చుకోవాల్సివచ్చింది.
 
 గాంధీ కుటుంబం జనాకర్షణ శక్తి అడుగంటిందనే చేదు గుణపాఠాన్ని కాంగ్రెస్ నేర్చుకుంది. ఒక కుటుంబం దేశాన్ని శాసిస్తుంటే ప్రధాని ఎలాంటి ప్రాధాన్యం లేకుండా మిగలడాన్ని ప్రజలు గత తొమ్మిదేళ్లుగా నిస్సహాయంగా చూస్తూ వచ్చారు. అవకాశం రావడంతోనే ఆ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అన్ని కసరత్తులూ చేసింది. ప్రధాన ప్రత్యర్థులైన నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఇద్దరిపైనా సమస్త చిట్కాలను ప్రయోగించింది. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌ను అవినీతిపరునిగా చూపాలని యత్నించింది. మోడీపై సీబీఐ కేసులను నమోదు చేయించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినది తానే తప్ప మన్మోహన్ కారని గత ఐదేళ్లుగా సోనియా నమ్ముతూ వచ్చారు. ధరలు ఎంతగా పెరుగుతున్నా ‘ఉచిత తాయిలాలు’ పంచితే చాలు ప్రజలు ఓట్లు వేసేస్తారని ఆమె విశ్వసించారు. మన్మోహన్‌ను పక్కకునెట్టి, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. అవినీతిని మినహాయిస్తే కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. నేడు కాంగ్రెస్ కర్ణాటక, అసోం, మహారాష్ట్రలలో మాత్రమే అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నా అక్కడంతా గందరగోళమే.
 
 ‘2014’పై ప్రభావం తథ్యం
 
 బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించినా ఢిల్లీలో విజయం సాధించలేకపోవడమే దానికి అతిపెద్ద పరాజయం. ఛత్తీస్‌గఢ్‌లో అది బొటాబొటీ విజయంతో పరువు దక్కించుకుంది. ఢిల్లీ కాక మరో రాష్ట్రం చేజారితే బీజేపీ లేదా మోడీ అనుకూల పవనాలు అదృశ్యమైపోయి ఉండేవే. అయితే బీజేపీ కూడా ఈ ఫలి తాల నుంచి కొన్ని గుణపాఠాలను నేర్చుకుంది.
 
 కాంగ్రెస్ పట్లా, అధిక ధరల పట్లా ప్రజలు విసిగిపోయారు కాబట్టే తాము గెలిచామని దానికి అర్థమైంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లలో ఆమ్‌ఆద్మీ లాంటి గట్టి పార్టీ లేదు. కాబట్టి బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను ముఖాముఖీ ఎదుర్కొని బీజేపీ విజ యం సాధించగలిగింది. మొత్తంగా చూస్తే... ఆమ్‌ఆద్మీ విజయం సాధించగా, కాంగ్రెస్ విఫలమైంది. బీజేపీ ఫలితాలు బాగానే ఉన్నా అంత గొప్పవేమీకావు. ఏదిఏమైనా 2014 ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావితం చూపుతాయనడం నిస్సందేహం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ దేశవ్యాప్తంగా పోటీకి దిగడానికి యత్నిస్తుందని, కాంగ్రెస్, బీజేపీలకు తాము ప్రత్యామ్నాయం కాగల మని కేజ్రీవాల్ అంటున్నారు. అది కొంత అత్యాశాపూరితమైన లక్ష్యమే కావ చ్చు. దేశవ్యాప్తంగా ఆపార్టీ ఎంతప్రభావం చూపగలుగుతుందనేది సందేహమే.
 
 గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ముస్లిం ఓట్లన్నింటినీ తానే దక్కించుకోవాలని ప్రయత్నించింది. ముస్లిం ఓటర్లు మాత్రమే గెలుపుకు సరిపోరని నాలుగు రాష్ట్రాల ఘోర పరాజయం తేల్చి చెప్పింది. అలాగే కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాలు, తెగలపై దృష్టిని కేంద్రీకరించింది.
 
 మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ సంఖ్యలో ఆదివాసి జనాభా ఉన్నా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇక షెడ్యూ ల్డ్ కులాల కోసం అసాధారణమైన రీతిలో కొత్త పథకాలను, విధానాలను రూపొందించి, భారీగా నిధులను కేటాయించింది. కానీ ఎస్సీలు కాంగ్రెస్‌కు ఓటు వేయడం మానేసారు. కాబట్టే ఢిల్లీలో ప్రేమ్‌సింగ్, రాజ్‌కుమార్ చౌహాన్ వంటి ఎస్సీ కాంగ్రెస్ నేతలు అనామకుల చేతుల్లో ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీలలో కాంగ్రెస్ అత్యంత పక్షపాత పూరితమైన గవర్నర్లను నియమించింది. ఆ రాష్ట్రాల్లో కేంద్ర నిధులను కుమ్మరించింది. ఆహార భద్రతా చట్టం తెచ్చి, పేదలకు ఆహారం అందిస్తున్నామంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వెచ్చించారు. అయితే ఆ చట్టాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు కనబడ లేదు. కనీసం రెండు రాష్ట్రాలనైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ అన్ని సర్కస్ ఫీట్లను ప్రదర్శించేసింది. ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి ఆలోచనలూ, ఆశా మిగల్లేదు. ఈ పరాజయాలు ఆ పార్టీ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీశాయి. ఓటమి భయం పుట్టించాయి. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని సోనియా ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే కాంగ్రెస్ వద్ద ఉన్న ఏకైక చిట్కా అని నా అభిప్రాయం.
 
 కాంగ్రెస్ ఇక వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తుంది. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్‌ను వదిలి నితీష్‌కుమార్‌తో కలవాలని చూస్తుంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు దగ్గరి బంధువు మన్‌ప్రీత్‌సింగ్ బాదల్‌తో మైత్రిని ఆకాంక్షిస్తుంది. ఏపీలోనూ మిత్రుల కోసం వెతుకులాట తప్పదు. తమిళనాడులో దానికి డీఎంకే తప్ప గత్యంతరం లేదు. అయితే డీఎంకే అందుకు సిద్ధపడుతుందా అనేది అనుమానం. ఒడిశాలో బిజూ జనతాదళ్ అసమ్మతి వాదులనైనా జత కలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోడానికి కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవడమేనని సోనియా గుర్తించినట్టున్నారు.
 
 కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజ స్థాన్, ఢిల్లీలలో వేల కోట్ల రూపాయలను ‘ఉచిత తాయిలాలు’గా కుమ్మరించారు, ‘అన్నీ ఉచితమే’ విధానాన్ని అనుసరించారు. అయినా పరాభవమే మిగిలింది. కాబట్టి ఇక ఆమె ఆర్థిక వ్యవస్థ పగ్గాలను మన్మోహన్‌కే అప్పగించి దరిజేర్చమని కోరవచ్చు. మధ్య తరగతి ఎలాగూ తమకు ఓటు చేయదని కాంగ్రెస్ గత తొమ్మిదేళ్లుగా మధ్యతరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు పట్టించుకోవాలని సోనియా భావించవచ్చు. కానీ అందుకు సమయం మించిపోయింది. అయితే అవినీతి వ్యతిరేక చర్యలతో అకట్టుకునే అవకాశం లేకపోలేదు. కానీ కాంగ్రెస్‌కు సుపరిపాలనను అందించడం ఎలాగో తెలియదు. ప్రతిభగల వ్యక్తులకు ప్రభుత్వాన్ని నడిపించే అధికారాలను అప్పగించడం దాని ఆలోచనకు అందదు. క్లుప్తంగా చెప్పాలంటే గాంధీల దర్బారు నిండా గుమిగూడిన వంధిమాగధులను కాంగ్రెస్ వదుల్చుకోలేదు. కాబట్టి దాని బుర్రలో కొత్త ఆలోచనలు పుట్టే ఆశ లేదు.
 
 ముగింపు పలికేస్తాడు జాగ్రత్త
 
 ఈ ఫలితాలు బీజేపీకి, మోడీకి గెలుపే కాదనలేం. కానీ ప్రతిచోటా అది కాంగ్రెస్‌ను ఓడించింది. దాదాపు 250 మంది పార్లమెంటు సభ్యులున్న దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీజేపీ ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది. ఏపీలో అది రాష్ట్రవిభజనను ఆపితే 25 మంది ఎంపీలను కూడగట్టుకోవచ్చు. అలాంటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోగల తెగింపు, రాజకీయ చతురత కలిగిన మేధ ఆ పార్టీకి లేదు. కాబట్టి అది కూడా ఎన్నికలకు ముందే పొత్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. అయితే ఈ రెండు ప్రాంతాల్లో దానికి కొత్త మిత్రులు దొరికే అశ లేదు. కొత్త మిత్రులు, కొత్త విజయాలు లేకుంటే... బీజేపీ 1996లో లాగా మూణ్ణాళ్ల ముచ్చట ప్రభుత్వం ఏర్పాటుతో సరిపెట్టుకోవాల్సివస్తుంది. దేశం ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో మోడీ సీట్లు సంపాదించగలరే గానీ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆయన పెద్దగా చేయగలిగినది లేదు.
 
 బీజేపీ ప్రజాసంబంధాల కార్యక్రమం మహాజోరుగా సాగుతోంది. అయితే అది కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఒక్క సీటును కూడా సంపాదించి పెట్టలేదు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా చేయగలదేగానీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అనేది అనుమానమే. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు నేర్పుతున్న గుణపాఠం ఒక్కటే... అవి బొత్తిగా ముసలివైపోయాయి, అలసిపోయాయి. గత ముప్పయ్యేళ్లుగా కాంగ్రెస్, బీజేపీల నాయకత్వం మారలేదు. వాళ్లు తమ పదవులను పట్టుకొని వదలడం లేదు. ఇప్పటికైనా వదలకపోతే... అతిపెద్ద ఇంద్రజాలకునిగా అవతరించిన కేజ్రీవాల్ చీపురు కట్ట మంత్రదండంతో వారికి ముగింపు పలకాల్సిరావొచ్చు. పట్టణీకరణ వేగంగా సాగుతున్న మన దేశంలో మార్పు కూడా నగరాల్లోనే ప్రారంభమౌతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement