
అరువు రాజకీయం, అదే యుద్ధతంత్రం
ఢిల్లీ ఎన్నికలలో భాజపా ఓటమిని మోదీ జీర్ణించుకోలేరు. విజయం అత్యవసరం.
ఢిల్లీ ఎన్నికలలో భాజపా ఓటమిని మోదీ జీర్ణించుకోలేరు. విజయం అత్యవసరం. అందుకే పార్టీలో మొదటి నుంచీ సేవచేస్తున్న నాయకులు ఏమనుకున్నా సరే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకత్వం అభిప్రాయం ఏమైనా సరే బేడీని రంగంలో దింపి కేజ్రీవాల్ ఆటకట్టించాలని భాజపా త్రిమూర్తులు (మోదీ, షా, జైట్లీ) నిర్ణయించారు.
సమాచార సాంకేతికరంగం (ఐటీ), వ్యాపారరంగం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కొత్త పదాలు తరచుగా వినిపిస్తున్నాయి. సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్-ముఖ్య కార్యనిర్వహణ అధికారి) వాటిలో ఒకటి. అవుట్‌సోర్సింగ్ అనే మాట తరచుగా వినిపించే మరో మాట. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ కారణంగానే మనదేశంలో ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇంతమంది ఐటీ ఉద్యోగులు దర్జాగా బతికేస్తున్నారు. కొన్ని దశాబ్దాల కిందట రాజకీయ నాయకులూ, వణిక్‌ప్రముఖులూ, పారిశ్రామికవేత్తలూ విడి విడిగా ఉండేవారు. సంపన్నుల సరసన కనిపించడానికి సైతం రాజకీయ నాయకులు సంకోచించేవారు. ఇప్పుడు వ్యాపారవేత్తలే రాజకీయనాయకులు అవుతున్నారు. రాజకీయ నాయకులకూ వ్యాపార లక్షణాలు అలవడుతున్నాయి. వ్యాపార నైపుణ్యం ప్రదర్శించడం రాజకీయ నాయకులకు అదనపు అర్హతగా, గర్వకారణంగా పరిణమిం చింది. రాజకీయ నాయకులు సంపన్నులతోనే వ్యవహారం చేస్తున్నారు.
అవుట్‌సోర్సింగ్ వ్యాపారానికే పరిమితం కాకుండా రాజకీయాలలోకి సైతం ప్రవేశించింది. అవుట్‌సోర్సింగ్ అంటే ఏదైనా ఒక సంస్థకు లేదా వ్యక్తికి ఒకానొక నిర్దిష్టమైన పని చేసే బాధ్యత అప్పగించడం, ఆ బాధ్యత నెరవేర్చినందుకు పారితోషికం చెల్లించడం. ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా పని సాధ్యం కాదని అనిపిస్తే, అదనంగా సాయం తీసుకుంటే తప్ప విజయం వరించదని భావిస్తే బయటి సంస్థకు లేదా వ్యక్తికి లేదా బృందానికి ఆ పని అప్పజెప్పడాన్ని పొలిటికల్ అవుట్‌సోర్సింగ్ అనుకోవచ్చు. 2014 ఎన్నికలలో ఒకటి, రెండు శాతం ఓట్లు తక్కువ పడతాయని అంచనా వేసుకొని వాటిని తీసుకొచ్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ (తెదేపా) నాయకుడు చంద్రబాబు నాయుడు సినీ నటుడు పవన్ కల్యాణ్‌కి అప్పగించడం ఇటువంటిదే.
ఎన్ని ఓట్లు హీరో కారణంగా వచ్చాయో తెలియదు కానీ తెదేపా విజయంలో ఆయన పాత్ర ఎంతోకొంత ఉన్నదని అందరూ అంగీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పని యావత్తూ సింగపూర్‌కి అవుట్‌సోర్స్ చేస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈ మాదిరి రాజధాని నిర్మాణం కోసం డిజైనింగ్ నుంచి నిర్మాణం దాకా ఒక బుల్లి విదేశానికి అప్పగించిన రాష్ట్రాధినేత కానీ దేశాధినేత కానీ ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ లేడు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మన దేశంలో అవుట్‌సోర్సింగ్‌లో కానీ ఆర్థిక సంస్కరణల అమలులో కానీ ఆద్యుడు చంద్రబాబునాయుడే. తర్వాత చాలా కాలానికి నరేంద్రమోదీ అందుకున్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా దావోస్ పర్యటన మాత్రం బాబు మాను కోరు. సంపన్నదేశాల అధినేతలను కలుసుకునే అవకాశం వదులుకోరు.
ఆంధ్రప్రదేశ్‌కు సీఈఓ చంద్రబాబునాయుడు అయితే మొన్నటి వరకూ గుజరాత్‌కూ, ఇప్పుడు భారత్‌కూ నరేంద్రమోదీ. కంపెనీని జయప్రదంగా నిర్వహించి లాభాల బాటలో నడిపించిన సమర్థుడైన సీఈఓగా పేరుప్రఖ్యాతులు సంపాదించాలి. సంపద సృష్టించాలి. ప్రగతి ఫలాలు పేదవారి బతుకులను బాగుచేయాలి. వారిని మధ్య తర గతిలోకి చేర్చాలి. ఇదీ విపణి చోదక ఆర్థిక వ్యూహం. అభివృద్ధి నమూనా. లక్ష్యం సాధించే సత్తా తన యంత్రాంగానికి లేకపోతే బయటి నుంచి శక్తియుక్తులను అరువు తెచ్చుకోవడంలో తప్పు లేదంటారు. గెలుపే ప్రధానం- వ్యాపారమైనా, రాజకీయమైనా.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరన్నది తెలిసిందే. అవసరమైతే శత్రువును కూడా అక్కున చేర్చుకోవాలి. పక్కన కూర్చోబెట్టుకోవాలి. నెత్తిన ఎక్కించుకోవాలి. ఈ సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) 2014 ఎన్నికల సమయంలో జయప్రదంగా అమలు చేశారు (2009లో చంద్రబాబునాయుడు ఇదే సూత్రం అనుసరించి తెరాసతో పొత్తు పెట్టుకొని చేసిన ప్రయోగం ఫలించలేదు). వరంగల్లు జిల్లాలో ఒక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా ఒక మహిళను నిలబెట్టినప్పుడు చాలా మంది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ‘మిమ్మల్ని అంతగా తిట్టిపోసిన వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి’ అంటూ ప్రశ్నించారు.
ఆమె ఏమని తిట్టారో కూడా కేసీఆర్ నవ్వుతూ చెబుతూ ఆ నియోజకవర్గంలోనే కాకుండా పక్క రెండు మూడు నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఆమెకు టిక్కెట్టు ఇవ్వక తప్పదని తేల్చిచెప్పారు. ఇది రాజకీ యం. చాణక్యుడి కాలం నుంచీ అమలు జరుగుతున్న యుద్ధతంత్రం. అందుకే కిరణ్ బేడీని భారతీయ జనతా పార్టీ (భాజపా)లోకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానించినప్పుడు దేశ ప్రజలు నివ్వెరపోలేదు. నిరుడు మే ఎన్నికల అనంతరం నరేంద్రమోదీ తన మంత్రిమండలిలోకి హర్షవర్దన్‌ను తీసుకోవడం పెద్ద తప్పిదం. మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా మంచి పేరున్న హర్షవర్ధన్ కేంద్ర కేబినెట్‌లో చేరిపోవడంతో ఢిల్లీ భాజపా విభాగం గట్టి నాయకుడు లేక బలహీనపడింది. బహునాయకత్వంతో ముఠాతగాదాలు ముదిరి పోయాయి.
కార్యకర్తలు కర్తవ్యతా విమూఢులై డీలా పడిపోయారు. 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందుకు ప్రజలకు సంజాయిషీ చెప్పుకొని వారికి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ దగ్గరైనారు. మోదీ రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌పైన పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి కారణం అదే. ప్రధాన ప్రత్యర్థి బలపడుతున్నాడనే స్పృహ మోదీ చేత దాడి చేయించింది. భాజపా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయకు చెందిన కంపెనీలు ఢిల్లీ విద్యుత్ బోర్డుకోసం చేసిన పనులలో అవినీతికి పాల్పడినాయంటూ కేజ్రీవాల్ ధ్వజం ఎత్తారు. ఉపాధ్యాయను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించే పరిస్థితి లేదు. ఒక వేళ పార్టీ ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోతే అది మోదీ పరాజయంగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. పైగా మోదీకీ, కేజ్రీవాల్‌కీ మధ్య పోటీ అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)కి అనుకూలం. మోదీ ప్రధానిగానే ఉంటారు. ముఖ్యమంత్రి పదవి స్వీకరించరు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వెల్లడించలేదు. తమతో మమేకమై, తమ దైనందిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వాగ్దానం చేస్తున్న కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రిగా మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించే అవకాశం ఉంది.
అందువల్ల కేజ్రీవాల్‌కు దీటైన ప్రత్యర్థిగా కిరణ్ బేడీని రంగంలోకి దించాలని నిర్ణయించారు. దేశంలోనే ఐపీఎస్‌కు ఎంపికైన మొట్టమొదటి మహిళగా, జైళ్ళలో సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థురాలైన అధికారిగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకురాలుగా ఢిల్లీ పౌరుల హృదయాలలో స్థానం సంపాదించిన బేడీని ఎన్నికలలో భాజపా పక్షాన దింపాలన్న ప్రతిపాదనను 2013 డిసెంబర్ నాటి ఎన్నికల సమయంలోనే పార్టీ నాయకత్వం చర్చించింది. కానీ ఎన్నికలకు ముందు బయటి వ్యక్తిని ఆహ్వానించి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపితే జీవితాంతం పార్టీకి విధేయులుగా ఉంటూ సేవచేస్తూ వచ్చిన నాయకులూ, కార్యకర్తలూ నొచ్చుకుంటారనే అభిప్రాయంతో ఆ ప్రతిపాదనకు స్వస్తి చెప్పారు.
కానీ అప్పటి కంటే ఇప్పుడు మోదీ ప్రాబల్యం పెరిగింది. ప్రతిష్ఠ పతాక స్థాయికి చేరింది. ఢిల్లీ ఎన్నికలలో భాజపా ఓటమిని మోదీ జీర్ణించుకోలేరు. విజయం అత్యవసరం. అందుకే పార్టీలో మొదటి నుంచీ సేవచేస్తున్న నాయకులు ఏమనుకున్నా సరే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)నాయకత్వం అభిప్రాయం ఏమైనా సరే బేడీని రంగంలో దింపి కేజ్రీవాల్ ఆటకట్టించాలని భాజపా త్రిమూర్తులు (మోదీ, షా, జైట్లీ) నిర్ణయించారు. బేడీతో పాటు షాజియా ఇల్మాను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. జయప్రద కూడా అదే దారిలో ఉన్నట్టు వార్త. అమర్‌సింగ్ తోడు లేకపోతే ఈ పాటికి జయప్రద భాజపాలో ఉండేవారు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా నాయకత్వానికి ఇబ్బంది ఉండదు. అమర్‌సింగ్ కూడా అంటే అభ్యంతరం.
కిరణ్ బేడీకి ఉన్న జనాకర్షణ శక్తిని వినియోగించుకొని అన్నాహజారే అనుయాయులలో చీలిక తెచ్చి ఆమ్ ఆద్మీ చీపిరి కట్టతోనే కేజ్రీవాల్‌ను కొట్టాలన్నది భాజపా వ్యూహం. మొన్నటి వరకూ మోదీకీ, భాజపాకూ వ్యతిరేకంగా ట్వీటర్‌లో వ్యాఖ్యలు చేస్తూ, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారే సరసన నిలబడి చేసిన ప్రసంగాలలో కాంగ్రెస్‌నూ, భాజపానూ ఒకే గాటన కట్టి దుయ్యపడుతూ వచ్చిన బేడీ పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తున్నారు.
కోర్టులు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ గుజరాత్ మారణకాండ విషయంలో ప్రజాకోర్టులో మోదీ నిర్దోషిగా ఇంకా నిరూపణ కావలసి ఉన్నదంటూ కరకుగా వ్యాఖ్యానించిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇప్పుడు మోదీని అభివృద్ధికి ప్రతీకగా, గాంధీజీ వారసుడుగా అభివర్ణించడం అందరికీ రుచించక పోవచ్చు. అయినా నరేంద్రమోదీయే స్వయంగా విమర్శలను విస్మరించి బేడీని పార్టీలోకి స్వాగతిస్తే మనకేమిటి సమస్య అని ఓటర్లు అనుకోవచ్చు. వీధి పోరాటాలలో ఆరితేరిన కేజ్రీవాల్‌పై ఆధిక్యం సాధించడం అంత సులువు కాదు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలంటూ ఇరవై సంవత్సరాలుగా ఉద్ఘోషిస్తూ ఎన్నికల ప్రణాళికలో సైతం భాజపా పొందుపరిచింది. ఆ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతకర్త యోగేంద్ర యాదవ్ సంధించిన ప్రశ్నకు భాజపా నాయకత్వం నుంచి సమాధానం లేదు. ఇప్పుడది అంత ముఖ్యమైన అంశం కాదంటూ బేడీ చెప్పిన జవాబు పేలవంగా ఉంది. బేడీ రాకతో ఆమ్ ఆద్మీ పార్టీలో కాక పెరిగింది. భాజపా శ్రేణుల్లో ఉత్పాహం ఉరకలు వేస్తోంది. ‘ఢిల్లీ కా సీఎం కైసా హో, కిరణ్‌బేడీ జైసా హో’ అంటూ నినదిస్తున్నారు.
మూడు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులూ అవినీతికి అతీతులే. కాంగ్రెస్ పార్టీ షీలాదీక్షిత్‌ను కాకుండా అజయ్ మాకెన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించడంతో పదిహేనేళ్ళ పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పొరపాట్లకు సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. భాజపా, ఏఏపీ మధ్య పోటీ వేడిగా వాడిగా ఉంటుంది. ఇప్పుడైతే భాజపావైపే రవ్వంత మొగ్గు కనిపిస్తోంది. భాజపా కనుక గెలుపొందితే రాజకీయాలలో అవుట్‌సోర్సింగ్ (పచ్చి అవకాశవాదం అని అర్థం) విధానం జయప్రదమైనట్టే. ఈ పదం రాజకీయ పదజాలంలో కూడా స్థిరపడిపోతుంది.
- murthykondubhatla@gmail.com
కె.రామచంద్రమూర్తి