ఉగసిరి పెంచునట్టి తొలి ఉత్సవ మియ్యది, ఊరు వాడలున్
ఉగసిరి పెంచునట్టి తొలి ఉత్సవ మియ్యది, ఊరు వాడలున్
సొగసుగ రంగులద్దుకొను, సోదర భావము పూజ్యమయ్యెనే
చిగురులు వేసె మత్సరము, చీకటి మూగెను, రైతు గుమ్మమే
బిగువగు భోజ్య భాండమగు బీదల యాకలి తీర్చు నియ్యెడన్
మాకంద మాధుర్య మైపూత మెక్కేటి
పికబాల పిసరంత పిలుపు లేదె?
మురిపించు వీధుల్ల, ముత్యాల ముగ్గుల్ల
తెలిదమ్ము నవ్వుల తీరు లేదె?
హాసమే హరితమై- హరివిల్లు హారమై
హోరెత్తు గీతాల హూతి లేదె?
అనురాగ బంధాల, ఆదర్శ బాంధవ్య
‘ఓ అన్న - ఓ బావ’ ఊసు లేదె?
కనగ చిననాటి భావాలు కలుష మాయె
వినగ కులజాడ్య మిప్పొద్దు వెల్లువాయె
సరస రమణీయ సహవాస సంధి సేయ
వరస కలిపేటి యువశక్తి వార్ధి యవదె?
- ఇప్పగుంట సూరి
9966289776
సంవత్సర ముఖి
కాలసింహం కాసేపాగి
నడచివచ్చిన దారిని
ఒకసారి అవలోకించి
సాగిపోయే సందర్భమిది.
ప్రాచీన గాయకుడు
మన్మథగీతాన్ని ఆలపించి
దుర్ముఖి గానాన్ని చేయటానికి
గొంతు సవరించుకొంటున్న సమయమిది.
దుర్ముఖినామ సంవత్సరమా!
నీ పేరు కొంచెం భయపెడుతున్నా
నీది మాత్రం మాతృహృదయమని
మాకు తెలుసులే.
అరవైయ్యేళ్ల క్రితం నీవొచ్చి
అందరం కలిసుండాలని
ఒక ఇల్లు ఇచ్చావు! గుర్తుందా?
మేమే
జీర్ణమయిందని దాన్ని విప్పుకొని
కొత్తగా రెండిళ్లు కట్టుకొన్నాం
ఉగాది పచ్చడి తినటానికి నీవిపుడు
రెండిళ్లకు రావాల్సి ఉంటుంది
తూర్పున ఉన్నాం కదా
ముందు మా ఇంటికే వస్తావులే!
సంవత్సర ముఖీ!
ఇందుముఖివై మా హృదయాలలో
ప్రేమను వర్షించు.
చంద్రముఖివై మా జీవితాలపై
చల్లని కాంతులు ప్రసరింపచేయి.
శతముఖివై ఈ సమాజపు చీకట్లను
తుడిచేసి వెలుతురు విత్తనాలను చల్లు.
జ్వాలాముఖివై మా ఆలోచనలను
జ్ఞానంతో జ్వలింపచేయి.
- బొల్లోజు బాబా
9849320443
రైతులు నాటౌట్‌గా నిలవాలి
వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశభక్తా
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకున్నావా దేశభక్తా?
ఇష్టమయిన క్రికెటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా
కోరుకున్నావా దేశభక్తా?
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా దేశభక్తా?
క్రికెట్ నిజం, మిగతాదంతా మిథ్య అనే ధోరణిని నిరసిస్తూ- సాగుబడి మాత్రమే నిజంగా నిజం అని రైతన్నకు పట్టం కడుతూ, రైతుకు ‘మనం చీర్ లీడర్స్ కావా’లని సూచిస్తూ- ‘రైతులు నాటౌట్‌గా నిలవాలి’ పేరుతో సైఫ్ అలీ సయ్యద్ రాసిన ఈ దీర్ఘ కవిత సామాజిక మాధ్యమాల్లో బాగా షేర్ అవుతోంది. పూర్తి పాఠం ఈ లింకులో: https://www.facebook.com/directorgoreysaifali
అన్నీ! ఆశ్చర్యాలే
చిన్నప్పుడు, భలే అన్నీ ఆశ్చర్యాలే
నక్షత్రాల లెక్క తప్పి, మళ్లీ ఒకట్నుంచి మొదలవ్వటం
భూతద్దంతో అరచేతిని సర్రున మండించటం
నాన్న పొడుగు అంగీలో మునిగిపోయి
అమ్మ చెప్పుల్లో దూర్చిన కాళ్లీడ్చటం
ఆచ్చికి తీసికెళ్తామంటే కొత్త బట్టల్లో వీధులన్నీ ఎగరటం
మనుషులు రైలుపెట్టెల్లా కదలడం
మేకచన్నులు నోట్లో పొదుక్కు తాగేయటం
తొండతోకకు దారం కట్టి, కాకిగుడ్లను గూడెక్కి చూడ్డం
పీత జాడలోకి పరిశోధకులవ్వటం
రేవు చప్టాలో జర్రున జారి- బోసిగా విరబూయటం
శ్రీరామనవమి పందిళ్ళలో పానకం చెంబులతో పోటీపడటం
నత్తినత్తిగా క్రిస్మస్ ప్రవచనాలు సాగదీయటం-
ఏం చూసినా ఆ చిచ్చుబుడ్డి కళ్ళకు ఆశ్చర్యాలే
నిద్రలో పండిన గోరింటా
ఆకాశంలో విమానం పంకా, ఎగిరే పక్షి రెక్కా
పండగలో ఏడ్చి కొనిపించిన బొమ్మచెక్కా
ఏ శత్రుత్వం లేని ఆటలు ఎంచక్కా
ఆహా! ఎంత అద్భుతం
కాలం పేజీల మీద నడుచుకుంటూ వెళ్లిన
నా బాల్యం... నా వొళ్ళో మనవడిలా ఆడుకుంటోంది...
- నేలపూరి రత్నాజీ
9440328432
ఉషశ్రీ జయంతి సభ
నేడు విజయవాడ, రేడియో ఆర్టిస్టుల కాలనీలోని ఉషశ్రీ నివాసంలో సాయంత్రం 6:25 నిమిషాలకు ఉషశ్రీ జయంతి సభ జరగనుంది. పాలపర్తి శ్యామలానందప్రసాద్, కలగా కృష్ణమోహన్, నండూరి రాజగోపాల్, గుమ్మా సాంబశివరావు పాల్గొంటారు.
దుర్ముఖి ఉగాది కవిసమ్మేళనం
మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ నిర్వహణలో ఏప్రిల్ 6న మధ్యాహ్నం 2:30కు 70 మంది కవులతో దుర్ముఖి ఉగాది కవిసమ్మేళనం జరగనుంది. పి.సుశీలకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్న ఈ సమ్మేళనంలో- మాడభూషి సంపత్‌కుమార్ పుస్తకాలు ‘చివరకు నువ్వే గెలుస్తావు’, ‘ఆలోచనలు’ ఆవిష్కరణ అవుతాయి. భువనచంద్ర, జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, వెన్నెలకంటి పాల్గొంటారు.
హైద్రాబాద్ విషాదం ఆవిష్కరణ
పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో- మీర్ లాయక్ అలీ ‘హైద్రాబాద్ విషాదం’(అనువాదం: ఏనుగు నరసింహారెడ్డి) ఆవిష్కరణ సభ ఏప్రిల్ 10న హైదరాబాద్, చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరగనుంది. దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి, కట్టా శేఖర్‌రెడ్డి, మహమ్మద్ అన్సారీ, అమ్మంగి వేణుగోపాల్, కె.పి.అశోక్‌కుమార్ పాల్గొంటారు.
గాలి అద్దం ఆవిష్కరణ
ఎం.ఎస్.నాయుడు కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ఆబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్‌లో జరగనుంది. కె.శివారెడ్డి అధ్యక్షతన అంబటి సురేంద్రరాజు, యాకూబ్, రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ, సిద్ధార్థ, ఆదిత్య కొర్రపాటి ప్రసంగిస్తారు.
కుసుమ ధర్మన్న రచనలు కావలెను
సామాజిక కార్యకర్త, కవి, సంపాదకుడు, తొలితరం అంబేడ్కరిస్టు కుసుమ ధర్మన్న పూర్తి రచనలను ‘ప్రజాశక్తి’ వెలువరించనుంది. ‘సామాజిక, సాహిత్య స్ఫూర్తి కుసుమ ధర్మన్న’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల వివిధ సంఘాలు జరపబోయే పూర్తిరోజు సదస్సులో ఆవిష్కరించనుంది. అయితే-మాకొద్దీ నల్లదొరతనం, హరిజన శతకం, విజయనగరంలో చేసిన ప్రసంగం మాత్రమే లభ్యమయ్యాయనీ, ఆయన ఇతర రచనలతోపాటు, ధర్మన్న నడిపిన జయభేరి పత్రిక సంచికలు కలిగి ఉన్నవారు వాటిని కూడా పంపవలసిందిగా సంపాదకురాలు కె.ఉషారాణి విజ్ఞప్తి చేస్తున్నారు. చిరునామా: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27-30-4, ఎం.బి.విజ్ఞాన కేంద్రం, ఆకులవారి వీధి, గవర్నరుపేట, విజయవాడ-2; ఫోన్: 9492879210