ఉపాధి వేటలో ఓడిన నిరుపేద | Vikarabad Migrant Worker Died in Dubai With Heart Stroke | Sakshi
Sakshi News home page

ఉపాధి వేటలో ఓడిన నిరుపేద

Jan 31 2020 12:41 PM | Updated on Jan 31 2020 12:41 PM

Vikarabad Migrant Worker Died in Dubai With Heart Stroke - Sakshi

పాండురంగారెడ్డి (ఫైల్‌) పాండురంగారెడ్డి కుటుంబీకులు

బాయికాడి శివకుమార్, నవాబ్‌పేట (వికారాబాద్‌ జిల్లా): బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన వ్యక్తి ఉపాధి వేటలో అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలోని ఎత్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మల్‌గారి అనంత్‌రెడ్డికి భార్య బిచ్చమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అనంత్‌రెడ్డికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో పెద్ద కొడుకు మల్‌రెడ్డి వేరే ఊరికి ఇళ్లరికం వెళ్లాడు. కాగా, అనంత్‌రెడ్డి పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి వరకు పదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉన్న చిన్న కుమారుడు పాండురంగారెడ్డిపై కుటుంబ భారం పడింది. అయితే, గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మెరుగైన ఉపాధి పొందాలని భావించిన పాండురంగారెడ్డి తెలిసిన వారి సహాయంతో 2004లో దుబాయికి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి 2007లో తిరిగి ఇంటికి వచ్చి హోటల్‌ పెట్టుకున్నాడు. 2010లో  వివాహం చేసుకున్నాడు. హోటల్‌ వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. దాంతో హోటల్‌ మూసివేశాడు. ఆ తర్వాత 8 గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అది కూడా అతనికి కలిసి రాలేదు.

పెట్టుబడులు కూడా చేతికి రాకపోవడంతో మరింత అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉన్న ఎకరంన్నర పొలాన్ని అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. అనంతరం కొంత డబ్బు కట్టి రెండు డీసీఎం వ్యాన్లను ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. ఆ వాహనాలను సరుకు రవాణా కిరాయిలకు నడిపాడు. అందులో కూడా పాండురంగారెడ్డికి నష్టం వచ్చింది. ఫైనాన్స్‌లో తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ వారు రెండు డీసీఎంలను తీసుకెళ్లారు. అప్పటికి రూ.4లక్షలు అప్పులు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉంటే బతకడం కష్టమని భావించి.. మరో రూ.3 లక్షలు అప్పులు చేసి గతేడాది సెప్టెంబర్‌ 25న దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ సోలార్‌ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, పాండురంగారెడ్డికి డిసెంబర్‌ 24న ఉదయం 6.30 గంటలకు గుండెనొప్పి వచ్చింది. గమనించిన తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఉదయం 8.30 గంటలకు మృతి చెందాడు. అతనితో పాటు పని చేసే వారు  విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపారు. భార్య జమున అక్కడికి పోలేని పరిస్థితి ఉండటంతో అతను పని చేసే కంపెనీ వారు ఒక వ్యక్తిని ఇచ్చి మృత దేహాన్ని ఈ నెల 7న ఇంటికి పంపారు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి మృతిచెందడంతో.. ఆయననే నమ్ముకొని ఉన్న భార్య జమున, కొడుకు అభిలాష్‌రెడ్డి(4ఏళ్లు), కూతురు అన్షిత(రెండేళ్లు), తల్లి బిచ్చమ్మ దిక్కులేని వారయ్యారు. ఇప్పుడు కుటుంబ పోషణే కష్టమైన తరుణంలో రూ.7లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాండురంగారెడ్డి కుటుంబం కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement