అమెరికాలో ఘనంగా ‘సంగీత గాన విభావరి’ కార్యక్రమం

Tantex Committee Conducted Music Programme In America - Sakshi

వాషింగ్టన్‌ : దివ్యాంగుల సహాయార్థమై వేగేశ్న ఫౌండేషన్‌ వారు.. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 11న ‘సంగీత గాన విభావరి’  కార్యక్రమాన్ని కూచిపూడి ఇండియన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ ఫంక‌్షన్‌ హాలులో అత్యంత ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేగేశ్న ఫౌండేషన్‌ స్థాపకుడు డా. వంశీ రామరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కీ.శే నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. 

వేగేశ్న ఫౌండేషన్‌ మీ ఎన్నారైల ప్రాజెక్ట్‌ అని, దీనిని సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించామని తెలిపారు. దీనికి డా. అక్కినేని నాగేశ్వరరావు సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారంటూ ఆయన సేవలను కొనియాడారు. అలాగే ఈ సంగీత గాన విభావరి కార్యక్రమాన్ని అమెరికాలోని వివిధ నగరాల్లో ఘంటసాల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీతోత్సవాల పేరిట సెప్టెంబర్‌ 21 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గాయకుడైన ఘంటసాల బాల కామేశ్వరరావు, గాన కోకిల ఆకునూరి శారదలతో పాలు పలువురు గాయనీ, గాయకులు ఆనాటి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ల పాటలైన రాముని అవతారం.. రవికుల సోముని అవతారం, చిటపట చినుకులు పడుతూ వుంటే.. వంటి పాత పాటలను పాడి అందరిని అలరించారు. నాగి వడ్డమన్నాటి, శారదలు ‘మంచుకురిసే వేళలో, లేత చలిగాలిలో హాయ్‌...’  పాడిన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. కార్యక్రమం అనంతరం డా. వంశీ రామరాజును గాయనీ శారద ఆకునూరి, ఘంటసాల బాల కామేశ్వరరావుతో పాటు టాంటెక్స్‌ అధ్యక్షుడు చినసత్యపు వీర్నపు తదితరులు శాలువా కప్పి, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. తర్వాత వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. రామరాజు చేస్తున్న సేవలను కొనియాడి, దివ్యాంగుల కోసం చేస్తున్న స్వచ్చంద సేవలో సంస్థను భాగస్వామిగా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్‌ పూర్వ అధ్యక్షులు డా. ఉరిమిడి నరసింహారెడ్డి, సీఆర్‌ రావు, చంద్రహాస్‌ ముద్దుకూరి, అనంత్‌ మల్లవరపులతో పాటు తదితరులు పాల్గొన్నారు.


Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top