గల్ఫ్‌ సమస్యలపై రాహుల్‌కు వివరణ

T Congress Gulf NRI President Meets Rahul Gandhi in Bahrain - Sakshi

బహ్రయిన్‌ : ప్రవాసీ సమ్మేళన్‌ను గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌(గోపియో) ఈ నెల 6 నుంచి 8 వరకూ బహ్రయిన్‌లో నిర్వహించింది. సమావేశం చివరి రోజైన సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ సమ్మేళన్‌లో పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌, టెలికాం నిపుణుడు శ్యామ్‌ పిట్రోడా తదితర బృందంతో పాటు, బహ్రయిన్‌ యువరాజు, ఆర్థిక మంత్రులతో రాహుల్‌ భేటీ అయ్యారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి 10 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై ఒక నివేదికను అందజేశారు. గల్ఫ్ దేశాల సహకారమండలి(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్-జిసిసి)లోని ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87.64 లక్షలు ఉన్నదని చెప్పారు. వీరందరూ ఎన్నారై ఓటర్లుగా ఆన్‌లైన్లో నమోదు చేసుకోవడానికి ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలనే ప్రస్తావన వచ్చిందని దేవేందర్ రెడ్డి తెలిపారు.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ  తన ఎలక్షన్ మేనిఫెస్టోలోని పేజీ నెం.22లో 'ప్రవాసుల సంక్షేమం' పేరిట ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గల్ఫ్‌లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, కేరళ తరహాలో జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌లతో కూడిన పథకం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చాక పునరావాసం కొరకు, గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ ప్రవాసీలకు న్యాయ సహాయానికి, గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో ఏటా రూ. 100 కోట్ల నిధులు కేటాయించడానికి, సమగ్ర ఎన్నారై పాలసీ కోసం కాంగ్రెస్‌ పార్టీ గల్ఫ్‌ విభాగం పోరాటం చేస్తుందని వివరించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top