సింగపూర్‌లో ఘనంగా సంగీత నాట్య ఉత్సవాలు | STS Tyagayya Tv International carnatic program held in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా సంగీత నాట్య ఉత్సవాలు

Sep 3 2019 1:59 PM | Updated on Sep 3 2019 6:02 PM

STS Tyagayya Tv International carnatic program held in Singapore - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీ సంయుక్తంగా అంతర్జాతీయ సంగీత నాట్య ఉత్సవాలను నిర్వహించింది. స్థానిక సిఫాస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సింగపూర్ వాసులను మంత్రముగ్ధులను చేసింది. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఎంతో ఆసక్తిగా 150 మందికిపైగా కళాకారులు పాల్గొని తమ సృజనాత్మకమైన కళానైపుణ్యంతో ఆహుతులని కట్టిపడేశారు. శాస్త్రీయసంగీతపోటీలు అసలుసిసలైన వీనులవిందుగా సాగిపోగా, శాస్త్రీయనృత్య పోటీలు కన్నులపండుగగా జరిగాయి. కళాకారులు మాత్రం ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ కర్ణాటక సంగీత విధుషీమణి నేపథ్య గాయని డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్, వెంపటి చిన సత్యంగారి ప్రముఖ శిష్యులు నాట్యాచార్య డాక్టర్ కృష్ణకుమార్ విచ్చేశారు.

ఈ సందర్భంగా నిత్యశ్రీ శాస్త్రీయ సంగీత విశేషాలను, ఆవశ్యకతను వివరించారు. ఇంతమంది కళాకారులకు సింగపూర్ లాంటి మహానగరంలో అంతర్జాతీయస్ధాయిలో వేదిక కల్పించి వారి నైపుణ్యాన్ని బాహ్యప్రపంచానికి చూపించే అవకాశం కల్పించిన సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీలను ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ శాస్త్రీయనృత్యవిశేషాలను, ప్రాముఖ్యతను, మహావిద్వాంసులు శ్రీత్యాగరాజు జీవితవిశేషాలను వివరించారు. అంతేకాకుండా అన్నమాచార్య కీర్తనలకు ఆయన శిష్యబృందం ప్రదర్శించిన నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మనసంస్కృతికి అద్దంపట్టే ఇటువంటి కార్యక్రమం నిర్వహించగలగటం తన మనస్సుకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తన కార్యవర్గం ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మున్ముందు మరింత భారీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. త్యాగయ్యటీవీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ సింగపూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేదుకు కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు త్యాగయ్యటీవీలో పదర్శించే అవకాశాన్ని ఇస్తామన్నారు. నిత్యశ్రీ, కృష్ణకుమార్‌ని “జీవన సాఫల్యపురస్కారం”  కోటిరెడ్డిని “కళాబంధు” బిరుదుతో త్యాగయ్య టీవీ ముఖ్యకార్యనిర్వహణాధికారి జనార్ధన్ సత్కరించారు. విజేతలందరికీ బహుమతులతో పాటు ఈ కార్యక్రమములో పాల్గొన్న ప్రతికళాకారునికి ప్రశంసా పత్రాన్ని అందించామని తెలిపారు. త్యాగయ్య టీవీ యాజమాన్యానికి, ఆహుతులకు, కళాకారులకు, కార్యవర్గసభ్యులకు, వ్యాఖ్యాతలకు, స్వచ్ఛందకార్యకర్తలకు, స్పాన్సర్స్ కు కార్యక్రమ నిర్వాహకులు జ్యోతీశ్వర్, స్వాతి, సుప్రియ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement