అభాగ్యులకు అండగా..

ICBF Services in Qatar From Thirteen Years - Sakshi

ఖతార్‌లో ఐసీబీఎఫ్‌ సేవలు

13 సంవత్సరాలుగా భారత కార్మికులను ఆదుకుంటున్న సంస్థ

సేపూరి వేణుగోపాలాచారి – సాక్షి, కామారెడ్డి: ఖతార్‌లోని ‘ఇండియన్‌ కమ్యూనిటీ బెనెవలెంట్‌ ఫోరం’ (ఐసీబీఎఫ్‌) ఆ దేశంలో భారతీయులకు విశేష సేవలను అందిస్తోంది. అక్కడి భారత దౌత్య కార్యాలయం కింద ఒక ప్రత్యేక సంస్థగా ఐసీబీఎఫ్‌ పనిచేస్తోంది. దోహా తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై, కోర్టు కేసులు, మృతదేహాల తరలింపులో ఈ సంస్థ సహాయ సహకారాలను అందిస్తున్నది. 2006లో ప్రారంభమైన ఐసీబీఎఫ్‌ పలు సేవల్లో ఆదర్శంగా నిలిచింది. ఇండియన్‌ ఎంబసీ ప్రాంగణంలో, దుకన్, అల్‌కోర్‌లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఐసీబీఎఫ్‌ సేవలను విస్తరించింది. కొంత మంది ఏజెంట్ల, కొన్ని కంపనీల మోసాల బారిన పడినవారు తమ సమస్యలను ఇండియన్‌ ఎంబసీ దృష్టికి తీసుకువెళ్తే ఎంబసీ సూచన మేరకు ఐసీబీఎఫ్‌ సంస్థ పనిచేస్తుంది. బాధితుల వివరాలు తెలుసుకుని ఆహారం, వసతి కల్పించడం, దాతల ద్వారా గానీ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ వారికి సహకారం అందిస్తారు.

ఐసీబీఎఫ్‌ సేవలు ఇలా..
ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐసీబీఎఫ్‌ తగిన సేవలందిస్తోంది.  
నకిలీ ఏజెంట్ల మోసాలకు గురై ఇక్కడకు వచ్చిన తర్వాత కనీస సౌకర్యాలు లేని వారికి అండగా నిలుస్తుంది. మహిళా కార్మికులకు వసతులు, సౌకర్యాలను కల్పిస్తుంది.  
ఖతార్‌లో చనిపోయిన వ్యక్తులపై ఆధారపడి ఉన్నవారికి సహాయం అందిస్తుంది.  
కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయపరమైన సహకారాన్ని సంస్థ సభ్యులు అందజేస్తారు.  
ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం, డాక్యుమెంటేషన్, రవాణా ఏర్పాట్లు చూ స్తారు. అందుకు అయ్యే ఖర్చులను ఐసీబీఎఫ్‌ భరిస్తుంది.  
జైల్లో ఉండే భారత ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందజేస్తారు.
భారత కార్మికులు నివసించే చోట్లలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నారు.

అవగాహన కల్పించాలి 
గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు, కల్పించే సౌకర్యాల మీద సరైన అవగాహన లేక ఎంతో మంది ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురవుతున్నారు. కంపెనీలు, ఉద్యోగాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి సమస్యల బారిన పడిన వారికి మా సంస్థ తరఫున ఆదుకుంటున్నాం. ఇక్కడ నిబంధనలను కఠినంగా ఉంటాయి. ఇండియన్‌ ఎంబసీని సంప్రదించిన తర్వాతనే కంపెనీ వీసాలపై నమ్మకం తెచ్చుకోవాలి. అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారు.–  రజనీమూర్తి, ఐసీబీఎఫ్‌ ప్రతినిధి, ఖతార్‌   

ఐసీబీఎఫ్‌ హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌  +974 446 70060
(సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు).మొబైల్‌: +974 555 12810

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top