ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి హత్యలో కొత్తకోణం

Ex boyfriend behind nri Preethireddy murder in Australia - Sakshi

సిడ్నీ : ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి హత్యలో ఆమె మాజీ ప్రియుడు డెంటిస్ట్‌ హర్ష వర్థన్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా హర్ష వర్థన్‌ బసచేసిన హోటల్‌కు ప్రీతి వెళుతున్నట్టు గుర్తించారు.

అయితే కొన్నేళ్ల క్రితమే ప్రీతిరెడ్డి, హర్ష వర్థన్‌లు మనస్పర్థల కారణంగా తమ ప్రేమకు స్వస్థి చెప్పారని తెలిసింది. అప్పటి నుండి కనీసం హర్ష వర్థన్‌ను చూడటానికి కూడా ప్రీతిరెడ్డి ఇష్టపడేది కాదని ఆమె స్నేహితులు తెలిపారు. అయితే ఇటీవల సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌కు ప్రీతిరెడ్డిని కలవడానికే హర్ష వర్థన్‌ కూడా వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా హోటల్‌లో హర్ష వర్థన్‌తో నువ్వంటే ఇష్టంలేదని, మరోసారి తనవెనుకపడొద్దంటూ ప్రీతిరెడ్డి స్ఫష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన హర్ష వర్థన్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, కత్తితో దాడి చేసి చంపిన ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్‌ వేల్స్‌ ప్రాంతంలో పార్క్‌ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై హర్ష వర్థన్‌ను ఫోన్‌లో పోలీసులు ఆరా తీయగా తనకేమీ తెలియదంటూ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మరుసటి రోజే  రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హర్ష వర్థన్‌, తన బీఎండబ్ల్యూ కారుతో కావాలనే ట్రక్కును ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు తండ్రి నర్సింహరెడ్డి మహబూబ్‌నగర్‌ వాసి. చాలాకాలం క్రితమే ఆస్ట్రేలియాకు వచ్చిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ సిడ్నీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


                                              హర్ష వర్థన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top