యోగా కేంద్రాలుగా పబ్‌లు

Yoga Centers in Pubs karnataka - Sakshi

ఉదయం ఖాళీ సమయంలో జిమ్, నృత్య కేంద్రాలుగా మార్పు  

నిర్వాహకులకు అదనపు ఆదాయం  

యువతలో ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ

కర్ణాటక ,బొమ్మనహళ్లి : నగర జీవన శైలి మారుతున్న వేళ...ఆరోగ్యంపై క్రమేపీ శ్రద్ధ ఎక్కువవుతోంది. ఇదే సమయంలో నగరంలో జనసమ్మర్దమైన ప్రాంగణాలు ఉల్లాస, ఉత్సాహ కేంద్రాలుగా మారుతున్నాయి. వీటిలో ప్రస్తుత యువతను ఆకట్టుకుంటున్నవి...పబ్‌లు, రెస్టారెంట్లు, కెఫేలు, బార్లు. ఉదయం పూట ఇవన్నీ ఖాళీగానే ఉంటాయి. వీటిల్లో కార్యకలాపాలు జోరందుకునేది సాయంత్రం అయిదు గంటల తర్వాతే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంగణాలను ఎందుకు ఖాళీగా ఉంచాలనుకున్నారో, ఏమో...చాలా మంది వాటిని క్రియాశీలక కార్య స్థావరాలుగా మార్చేస్తున్నారు. అంటే..యోగా, జిమ్, నృత్య శిక్షణా కేంద్రాలుగా అన్న మాట.

నగరంలో ఈ ఒరవడి ఇప్పుడు క్రమేపీ పుంజుకుంటోంది. వీటిల్లో కొన్ని పుస్తక పఠన కేంద్రాలు, చిత్ర లేఖన కార్యగోష్టులుగా కూడా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య ఇలాంటి విన్యాసాలకు చాలా మంది ఇష్టపడడం లేదని, గాలి, వెలుతురు బాగా సోకే ఆరుబయట ప్రాంతాలను చాలా మంది ఎంచుకుంటున్నారని ఓ పబ్‌ నిర్వాహకుడు తెలిపారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారికి బ్రేక్‌ఫాస్ట్‌ ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా కొంత ఆర్జన కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరా నగర్, క్వీన్స్‌ రోడ్డు, ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులలో ఇలాంటి వ్యాపకాలు కాలానుగుణంగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో వారం విడిచి వారం నృత్య, ఇతర అభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఫిట్‌నెస్, దాని సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తద్వారా ఇంతకుమునుపు ప్రయత్నించని వాటి పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తూ, వారిని కార్యోన్ముఖులను చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు. ప్రారంభంలో పెద్ద మొత్తంలో ఫీజు కట్టినందున, విధిగా వెళ్లాలనే భావన రాకుండా, తమకు ఇష్టమైన కార్యక్రమాలను ఎంచుకుని, వాటికి మాత్రమే హాజరయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో దేహదారుఢ్య అభ్యాసాలతో పాటు గుండెను దిటువు చేసే లఘు అభ్యాసాలు, నృత్య విన్యాసాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు 23–40 ఏళ్ల ప్రాయంలోని వారు సగటును 25 మంది చొప్పున హాజరవుతుంటారని, వారి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తుంటామని వివరించారు. ప్యాకేజీలో భాగంగా వారికి అల్పాహారం కూడా సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమాల కోసం నిష్టాతులైన శిక్షకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top