వారి బాధలు అన్నీ ఇన్నీ కావు! | Widowed Women Farmers Come To Mumbai To Demand Their Rights | Sakshi
Sakshi News home page

Nov 22 2018 4:43 PM | Updated on Nov 22 2018 4:46 PM

Widowed Women Farmers Come To Mumbai To Demand Their Rights - Sakshi

‘కనీసం నాకు చనిపోవాలనిపిస్తోంది’ అని ఆయన నాతో ఏనాడు అనలేదు.

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని లాథూరు జిల్లాకు చెందిన కమలాభాయి దాల్వే ఆరు నెలల క్రి తం భర్తతో కలిసి తమ రెండు ఎకరాల పొలానికి వెళ్లింది. సాయంత్రం పూట ఇంటికెళ్లి కొన్ని బక్రీలు (మహారాష్ట్ర, గుజరాత్, గోవాలో ఎక్కువగా తినే ఒక రకమైన దిబ్బ రొట్టెలు) తీసుకరావాల్సిందిగా ఆమెను ఆమె భర్త కోరారు. ఆమె అలాగే ఇంటికెళ్లి అప్పటికప్పుడు దిబ్బ రొట్టెలు చేసి తీసుకొచ్చింది. ఈలోగా ఊహించని ఘోరం జరిగిపోయింది. పురుగుల మందు తాగి ఆమె భర్త చనిపోయి ఉన్నాడు. ‘కనీసం నాకు చనిపోవాలనిపిస్తోంది’ అని ఆయన నాతో ఏనాడు అనలేదు. గత రెండేళ్లుగా తమ పొలం ద్వారా ఎలాంటి రాబడి రాలేదని, తీసుకున్న రుణాలు రెండు, మూడు లక్షల రూపాయలకు పెరిగిపోయిందని ఆమె తెలిపారు.

రైతు సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా ముంబై నగరానికి బుధవారం తరలివచ్చిన వేలాది మంది రైతుల్లో కమలాభాయి దాల్వే ఒకరు. మరాఠా, విదర్భ ప్రాంతాల నుంచి వచ్చిన 80 మంది వితంతువుల్లో కమలాభాయి ఒకరు. వారంతా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు. రైతులను ఆదుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతూ వస్తోంది. ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1995 నుంచి 2015 వరకు 65 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రాష్ట్రంలోని వితంతు మహిళలందరికి నెలకు 600 రూపాయలు పింఛను అందాల్సి ఉండగా, 34 శాతం మంది వితంతువులకు మాత్రమే పింఛను అందుతోంది. 33 శాతం మందికి ఈ పింఛను గురించి తెలియక దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్నా 26 శాతం మందికి అధికారులు కుంటి సాకులతో పింఛను తిరస్కరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పదేళ్ల క్రితం ప్రకటించిన లక్ష రూపాయల పరిహారమే ఇప్పటికీ కొనసాగుతోంది.
 

తెలంగాణలో ఐదు లక్షల వరకు ఆంధ్రలో మూడున్నర లక్షల వరకు ఇలాంటి పరిహారాన్ని చెల్లిస్తున్న విషయం తెల్సిందే. మహారాష్ట్రలో బాధితులకు లక్ష రూపాయల పరిహారం కూడా సంక్రమంగా అందడం లేదు. భర్తఆత్మహత్య చేసుకున్నందుకు నష్టపరిహారంగా  రెండు నెలల క్రితం తన బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయలు వచ్చి పడ్డాయని, ఇదేమిటని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరని అన్నారు. ర్యాలీకి వచ్చిన 80 మంది వితంతువుల్లో 29 శాతం మందికి పొలాలు తమ పేర్ల మీద బదిలీ కాలేదు. వారిలో 43 శాతం మందికి చిన్నపాటి ఇళ్ల యాజమాన్య హక్కులు బదిలీ కాలేదు. వారిలో ఒక్కొక్కరి ఒక్కో సమస్య. ‘నా భర్త చనిపోయాక, నీవు కూడా పురుగుల మందు తాగి చనిపో లేదా పుట్టింటికి వెళ్లిపో’ అంటూ తన అత్తింటి వారు తరిమేశారని విదర్భ నుంచి మరో వితంతువు మీడియాకు తెలిపారు. వితంతు మహిళల తరఫున ప్రత్యేకంగా పోరాడుతున్న ‘మహిళా కిసాన్‌ అధికారి మంచ్‌’ వారిని ఇక్కడకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 2012 నుంచి 2018 మధ్య ఆత్మహత్యలకు పాల్పడిన 505 మంది రైతుల భార్యలను ఇంటర్వూ చేసి రూపొందించిన ఓ నివేదికను కూడా మంచ్‌ ఇక్కడ విలేకరుల సమక్షంలో ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement