ధరలపై దద్దరిల్లనున్న పార్లమెంట్ | Sakshi
Sakshi News home page

ధరలపై దద్దరిల్లనున్న పార్లమెంట్

Published Sun, Jul 6 2014 9:20 AM

ధరలపై దద్దరిల్లనున్న పార్లమెంట్

గళం విప్పడానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ఎలాంటి అంశంపైనైనా చర్చించడానికి సిద్ధం: వెంకయ్యనాయుడు


న్యూఢిల్లీ:
పార్లమెంట్‌లో ప్రభుత్వానికి ధరల పెరుగుదల కాక గట్టిగానే తగలనుంది. సోమవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షాలు గళం విప్పనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి శనివారం ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో రెండు సభల్లోనూ ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తృణమూల్ కాంగ్రెస్  సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ..  బడ్జెట్ చర్చ తర్వాత వెంటనే ధరల పెరుగుదల అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. రవాణా చార్జీలు పెరగడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
 
అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సాధారణ, రైల్వే బడ్జెట్లపై చర్చతో పాటు ఈ సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చిస్తామని, ప్రతిపక్షాలు లేవనెత్తిన ఎలాంటి అంశంపైనైనా సమాధానమివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదే సమయంలో సభ గౌరవ మర్యాదలు కాపాడాలని ప్రతిపక్షాలను కోరారు. ఇరాక్‌లోని భారతీయుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రెండు సభల్లోనూ ప్రకటన చేస్తారని వెల్లడించారు. పోలవరం, ట్రాయ్ ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇస్తామని వెంకయ్య చెప్పారు. పెండింగ్ బిల్లులపై దృష్టి సారిస్తామని, ప్రాధాన్యతను బట్టి వాటిని సభలో ప్రవేశపెడతామని అన్నారు. జాతీయ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌పై వాణిజ్య మంత్రిత్వ శాఖ బిల్లు తీసుకువస్తుందని వెల్లడించారు.
 
అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్

ఇక ఆగస్టు 14తో ముగిసే ఈ సెషన్‌లో 168 పనిగంటలతో 28 సిటింగ్‌లు ఉంటాయని సుమిత్ర తెలిపారు. ఈ భేటీ మంచి వాతావరణంలో జరిగిందని, ప్రతిపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయన్నారు. సభ సజావుగా నడవడానికి అందరూ సహకరిస్తామనానరని, అన్ని విషయాలపై చర్చించడానికి ప్రభుత్వమూ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. పలు సూచనలపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ సమావేశాల్లో వెనకాల వరుసలో కూర్చుని మాట్లాడేవాళ్లు కూడా అందరికీ కనబడేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రస్తావన భేటీలో రాలేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాగా, లంచ్‌కు హాజరైన ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీలు  భేటీకి రాలేదు.  ఈ సమావేశంలో విపక్షాల సంబంధించి కాంగ్రెస్, బీజేడీ, సీపీఎం, ఎస్‌పీ నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement