మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా | Water Train Headed To Drought-Torn Latur. But With Less Than Expected | Sakshi
Sakshi News home page

మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా

Apr 11 2016 3:21 PM | Updated on Oct 8 2018 5:45 PM

కరువుతో అల్లాడుతోన్న మహారాష్ట్రకు పక్కరాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు.

తినడానికి గింజలులేవు.. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా దొరకటంలేదు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రులకు తీసుకెళితే డాక్టర్లు సైతం చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క ఆసుపత్రిలోనూ నీళ్లు లేవు. అత్యవసర ఆపరేషన్లను సైతం వైద్యులు వాయిదావేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో తీవ్ర దుర్భిక్షంగా భావిస్తోన్న మహారాష్ట్ర కరువుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. రాజస్థాన్ లోని ఒక డ్యామ్ నుంచి రైలుద్వారా నీళ్లను తరలించేందుకు భారీ సన్నాహాలు చేసింది.
ఇందుకోసం ప్రత్యేకంగా నీటి రవాణాకు వినియోగించే 60 బోగీల(ట్యాంకుల) రైలును ఏర్పాటుచేశారు రైల్వే అధికారులు. రాజస్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నీళ్లను మోటార్ల ద్వారా ట్యాంకుల్లో నింపి కరువు కేంద్రం లాతూర్ పట్టణానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే డ్యామ్ నుంచి నీళ్లను నింపటం ఆసత్యమవుతున్నందున తొలి విడతగా 10 బోగీ(ట్యాంకు)లతో కూడిన రైలు ఆదివారం సాయంత్రం లాతూర్ కు బయలుదేరింది. శుక్రవారంలోగా మిగిలిన 50 బోగీల నీటిని కూడా తరలిస్తామని అధికారులు చెప్పారు. రైలు ద్వారా మొత్తం 5 లక్షల లీటర్ల నీటిని కరువు ప్రాంతానికి చేరవేయనున్నారు.

మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో అధికం కానున్న ఎండలకు ఎలా తట్టుకోవాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement