బృందావన్ వితంతువుకూ హోలీ | Vrindavan widows break taboo, celebrate colourful Holi | Sakshi
Sakshi News home page

బృందావన్ వితంతువుకూ హోలీ

Mar 22 2016 4:53 PM | Updated on Sep 3 2017 8:20 PM

జీవితంలో ఎలాంటి సుఖాలు ఎరుగకుండా నిత్యం శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో బతుకుబండి లాగించే బృందావన్ పట్టణ వితంతువుల్లో ఈ సారి నిజంగా వసంతం విరిసింది.

బృందావన్: జీవితంలో ఎలాంటి సుఖాలు ఎరుగకుండా నిత్యం శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో బతుకుబండి లాగించే బృందావన్ పట్టణ వితంతువుల్లో ఈ సారి నిజంగా వసంతం విరిసింది. హోలి పండుగ వారికి కొత్త రంగులు పులిమింది. వారి తెల్లచీరలు రంగుల హరివిల్లుగా మారాయి. వారి వితంతు జీవితాల్లో మొట్టమొదటి సారిగా హోలి పండుగ సందడి చేసింది. పట్టణంలో దాదాపు ఆరువేల మంది వితంతువులు ఉండగా, వెయ్యిమందికి పైగా హోలి వేడుకల్లో పాల్గొన్నారు. వారి సౌఖ్యం కోసం కృషి చేస్తున్న ‘సులభ్ ఇంటర్నేషనల్’ ఎన్జీవో సంస్థ వారికీ అవకాశం కల్పించింది.

నిత్యం శ్రీకృష్ణ నామస్మరణం మారుమ్రోగే బృందావనంలో జరిగే ఏ వేడుకల్లో కూడా వితంతువులు పాల్గొనరాదు. వారిని అనుమతించరు. అనాదిగా వస్తున్న ఆచారమది. సమాజంలో కూడా ఈ అనాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. రాఖీ పండగ వేడుకల్లో వితంతువులు చురుగ్గా పాల్గొనేలా చేసిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థనే ఈసారి హోలి వేడుకల్లో వితంతువులు పాల్గొనేందుకు చొరవ తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వితంతువుల యోగక్షేమాలను చూసుకుంటున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ హోలీలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వితంతువులు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో తమను కలిపేసినందుకు వారానందం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 22 ఏళ్ల వయస్సు నుంచి వందేళ్ల వయస్సున్న వారి వరకు వితంతువులు ఉన్నారు. వారిలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఇంట్లోవాళ్లు ఎల్లగొడితే వచ్చి ఇక్కడ చేరిన వారే ఎక్కువ. వారిలో నా అన్న వాళ్లు లేనివారు కూడా ఉన్నారు. పట్టణంలో వారికి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. వాటిలో తలదాచుకునే అవకాశం దొరకని వారు బిచ్చం ఎత్తుకుంటూ రోడ్లపైన జీవిస్తున్న వారే ఎక్కువ. హోలి పండుగ వారి జీవితాల్లో కొత్త వసంతాలు పూయిస్తాయోమో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement