కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు | Vivek, Vinod rejoin into Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు

Mar 31 2014 1:23 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు - Sakshi

కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు

కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వివేక్ అన్నారు. కాగా తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు. గతంలో తెలంగాణ కోసమే కాంగ్రెస్ను వీడామని, తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పారు.

వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో  సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.

వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి  గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement