అమిత్‌ షా ర్యాలీ నేపథ్యంలో బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత

Violence Take Place In Amit Shah Kolkata Roadshow - Sakshi

కోల్‌కతా : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతా ర్యాలీ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ- అధికార తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రచార వేదిక వద్దకు చేరుకున్న తృణమూల్‌ శ్రేణులు బీజేపీ బ్యానర్లు చించివేశాయి. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అమిత్‌ షా రోడ్‌ షో నేపథ్యంలో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. బీజేపీ, తృణమూల్‌తో పాటు లెఫ్ట్‌ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ- బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సౌత్‌ 24 పరగణాల్లో అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మమతా దీదీ... జై శ్రీరాం అంటూ నేనే కోల్‌కతాలోనే ఉంటా. మీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్‌ చేయండి’  అని సవాల్ చేశారు. కాగా అమిత్‌ షా ర్యాలీతో పాటు హెలికాప‍్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు మమతా సర్కార్‌ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన మంగళవారం నిర్వహించిన రోడ్‌ షోకు కూడా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top