ఆ ఎంపీకి ఉగ్రవాదులతో సంబంధాలు

vijay rupani says, mp ahmed patel links to isis suspects - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌ : ఈమధ్య అరెస్టయిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదితో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌కు సంబంధాలున్నాయని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఆరోపించారు. అహ్మద్‌ పటేల్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ వ్యాఖ్యలను అహ్మద్‌ పటేల్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమని అహ్మద్‌ పటేల్‌ పేర్కొన్నారు.

రెండురోజుల కిందట గుజరాత్‌ యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీస్‌) అధికారులు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఖాసిం స్టింబర్‌వాలా అన వ్యక్తి అహ్మద్‌ పటేల్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్న సర్దార్‌ పటేల్‌ ఆసుపత్రిలో టెక్నీషిన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అహ్మద్‌ పటేల్‌లు ప్రజలకు వివరణ ఇవ్వాలని విజయ్‌ రూపానీ గాంధీనగర్‌లో డిమాండ్‌ చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయో ఒక్కసారి ఊహించుకోవాలని ఆయన తెలిపారు.

ఖాసిం స్టింబర్‌వాలాను అరెస్ట్‌ చేయడానికి కేవలం రెండు రోజుల ముందే ఆసుపత్రిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని విజయ్‌ రూపానీ చెప్పారు. ఈ విషయమే అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

విజయ్‌ రూపానీ వ్యాఖ్యలపై ఎంపీ అహ్మద్‌ పటేల్‌ ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఇద్దరు ఉగ్రవాదులకు అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌ సిబ్బందికి అభినందనలు అని అహ్మద్‌ పటేల్‌ చెప్పారు. అంతేకాక వారిపై దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి శిక్షించాలని కోరారు. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అహ్మద్‌ పటేల్‌ స్పష్టం చేశారు. అంతేకాక ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం.. దీనిపై రాజకీయాలు వద్దని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top