ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ | VG Siddhartha Letter To Coffee Day Employees | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. క్షమించండి : సిద్దార్థ

Jul 30 2019 12:21 PM | Updated on Jul 30 2019 2:27 PM

VG Siddhartha Letter To Coffee Day Employees - Sakshi

బెంగళూరు : కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యం సంచలనంగా మరింది. సోమవారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌ బ్రిడ్జిపై ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన సిద్దార్థ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం నదిలో అధికారులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. అయితే తను ఇంట్లో నుంచి వెళ్లే ముందు కాఫీ డే ఉద్యోగులకు, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లకు ఓ లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. అందులో తాను పారిశ్రామికవేత్తగా విఫలమైనట్టుగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.

‘37 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేశాను. మన కంపెనీల్లో ప్రత్యక్షంగా 30 వేల మందికి, బయట మరో 20 వేల మందికి ఉపాధి కల్పించాను. కానీ ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోతున్నాను. ఓ ప్రయివేటు ఈక్విటీలోని షేర్లను బైబ్యాక్‌ చేయమని వాటాదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు ముందు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. మీ అందరు నాపై ఉంచిన నమ్మకాన్ని కాదని వెళ్తున్నందుకు క్షమించండి. ఎవరిని మోసం చేయాలనేది, తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు.  తప్పులన్నింటికీ నా ఒక్కడిదే బాధ్యత. నేను జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి నా టీమ్‌కు‌, ఆడిటర్లకు, మేనేజ్‌మెంట్‌కు తెలియదు.  మీరంతా కొత్త యాజమాన్యంతో కలిసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓ వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరంతా నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని అనుకుంటున్నాన’ని సిద్దార్థ లేఖలో పేర్కొన్నారు. 

కాగా, సిద్దార్థ చిక్‌మంగళూర్‌లో జిల్లాలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కాఫీ తోటలను పెంచేవారు. దీంతో సిద్దార్థ కూడా ఆ రంగంలోకి ప్రవేశించారు. 1996లో తొలి కేఫ్‌ కాఫీ డేను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని చాలా అభివృద్ధి చేశారు. కేఫ్‌ కాఫీ డేను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు. దేశంలో ‘కాఫీ కింగ్‌’గా పేరొందారు. సిద్దార్థ ఇటీవల మైండ్‌ ట్రీ కంపెనీలో తనకున్న వాటాలను రూ. 3 వేల కోట్లకు అమ్మేశారు. కేఫ్‌ కాఫీ డేను కోకా కోలా కంపెనీకి అమ్మేందుకు సిద్దార్థ చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. సిద్దార్థ బీజేపీ నాయకుడు ఎస్‌ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవికను వివాహం చేసుకున్నారు. 

చదవండి : మాజీ సీఎం అల్లుడు అదృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement