పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ఉండటం, అందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం ఉండటం వంటి కారణాలవల్లే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.
సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశం సజావుగా జరిగిందని, పార్లమెంటు కార్యకలాపాల్లో మద్దతుకోసమే ఆమెను కలిసినట్లు చెప్పారు. తాము చేసే ప్రతిపనిని ప్రతిపక్షాలకు తప్పక వివరిస్తామని, వారు విలువైన సూచనలిస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. అధికారపక్షం, మిత్రపక్షం సమన్వయంతో ముందుకెళితేనే బాగుంటుందని తెలిపారు.