రైల్వేలో 13,847 పోస్టులు

Vacancy on more than 13 thousand posts in Railways - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే శాఖ 13వేలకు పైగా భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజినీర్‌(జేఈ), జూనియర్‌ ఇంజినీర్స్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌(డీఎంఎస్‌), కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌(సీఎంఏ) పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టుల వేతన స్కేలు రూ.35,400 నుంచి రూ.1,12,400గా ఉంది. ‘13,847 పోస్టులకు ఆర్‌ఆర్‌బీæసైట్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూనియర్‌ ఇంజినీర్ల పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి.

డిపో సూపరింటెండెంట్‌ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు లేదా సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన వారు అర్హులే. జూనియర్‌ ఇంజినీర్‌(ఐటీ)పోస్టులకు పీజీడీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌)/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)/ డీవోఈఏసీసీ ‘బీ’లెవెల్‌ మూడేళ్ల కోర్సు లేక గుర్తింపు పొందిన వర్సిటీ/సంస్థ నుంచి తత్సమాన కోర్సు చేసిన వారు అర్హులు. కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన 45 శాతం మార్కులు పొందిన వారు అర్హులు. ఈ 2వ దశ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 31’ అని  పేర్కొంది. ఈ పోస్టులకు  జనవరి 1, 2019 నాటికి 18–33 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులని నోటిఫికేషన్‌లో తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top