
టెక్నాలజీని వినియోగించుకోండి
సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పాఠశాలలకు సూచించారు.
భారతి శిక్షా సంస్థాన్ పాఠశాలలకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పాఠశాలలకు సూచించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి విజ్ఞానం ఎక్కడనుంచి లభించినా స్వీకరించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అన్ని రంగాల్లో అత్యవసర అంశంగా మారిందన్నారు. శుక్రవారం మోదీ విద్యాభారతి అఖిల భారతి శిక్షా సంస్థాన్ పాఠశాలల ప్రిన్సిపాళ్ల సదస్సులో ప్రసంగించారు. అఖిల భారతి శిక్షా సంస్థాన్ నడుపుతున్న 12 వేల స్కూళ్లలో ఎల్‌ఈడీ వాడాలని, దీంతో విద్యుత్‌తోపాటు డబ్బును కూడా ఆదా చేయవచ్చని అన్నారు.
ప్రధానికి డాక్టర్ ఆఫ్ లా పురస్కారం.. ప్రధాని మోదీని డాక్టర్ ఆఫ్ లా పురస్కారంతో సత్కరించాలని బెనారస్ హిందూ వర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 22న జరిగే స్నాతకోత్సవంలో పురస్కారాన్ని అందజేయాలని భావిస్తోంది. కాగా,‘మేక్ ఇన్ ఇండియా’ వారోత్సవాలు శనివారం నుంచి ముంబైలో మొదలవుతున్నాయి. వీటిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.