ఈ ఏడాదిలో వినూత్న పెళ్లిళ్లు | Unusual Weddings of 2016 in india with new thinking | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదిలో వినూత్న పెళ్లిళ్లు

Dec 30 2016 8:40 AM | Updated on Sep 4 2017 11:54 PM

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నది నాటి తరం నినాదం. పెళ్లంటే పది మందికి ఉపయోగపడాలన్నది నేటితరం నినాదం.

న్యూఢిల్లీ: పెళ్లంటే నూరేళ్ల పంట అన్నది నాటి తరం నినాదం. పెళ్లంటే పది మందికి ఉపయోగపడాలన్నది నేటితరం నినాదం. మనం వీడ్కోలు పలుకనున్న ఈ 2016 సంవత్సరంలో ఈ నినాదంతోనే ఎన్నో జంటలు వినూత్నంగా పెళ్లి చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచాయి. వాటిలో కొన్ని.....

1. బ్యాండ్‌ బాజాలు, పూలు, స్వీట్లు లేకుండా.....
అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని, గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుపుకోవాలని ఎన్నో జంటలు ఆశిస్తాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అభయ్‌ దేవరే, ముంబైలోని ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రీతి కుంభారే ఇందుకు భిన్నమైన వారు. పెళ్లి పేరిట అనవసరంగా ఖర్చు చేసే బదులు, ఆ సొమ్మును ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం వెచ్చించాలనుకున్నారు. వారు నిరాడంబరంగా పెళ్లి చేసుకొని రైతులు ఆత్మహత్య చేసుకున్న పది కుటుంబాలకు 20వేల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అమరావతిలోని ఐదు గ్రంధాలయాలకు 52 వేల రూపాయల పుస్తకాలను కొనిచ్చారు. బీటెక్‌చేసి, 2015లో యూపీఎస్‌యూ పాసైన అభయ్‌ ఇప్పుడు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్నారు.

2. నగలకు బదులు చెట్ల మొక్కలు....
మధ్యప్రదేశ్‌లోని కిసీపురాకు చెందిన పెళ్లి కూతురు ప్రియాంక భడోరియా పెళ్లి రోజున తన అత్తవారింటి నుంచి ఎలాంటి బంగారు నగలు కోరుకోలేదు. వారి కుటుంబం అచారం ప్రకారం పెళ్లి రోజున ధరించేందుకు ఎలాంటి నగలు కావాలో కోడలును అడగడం, వారు వాటిని తెచ్చివ్వాలి. పెళ్లి రోజున ప్రియాంకను తన అత్తారింటివారు ఎలాంటి నగలు కావాలని కోరగా, తనకు నగలు వద్దని, వాటికి బదులుగా చెట్ల మొక్కలు కావాలని కోరారు. అందుకు అమితానంద పడిన అత్తింటివారు ఆమెకు ఏకంగా పదివేల మొక్కలను తీసుకొచ్చి బహూకరించారు. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో కలసి ఆ మొక్కలను ఇరువురి ఇళ్లల్లో, వీధుల్లో నాటారు.

3. పేదలకు 90 ఇళ్లు.....
మహారాష్ట్రకు చెందిన మనోజ్‌ మునాట్‌ అనే వ్యాపారవేత్త అందరి తండ్రుల్లాగే తన కూతురు శ్రేయ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బును కూడా వెనకేశారు. చివరకు కూతురు పెళ్లి కుదిరేనాటికి కూతురు కోరికను తీర్చాల్సి వచ్చింది. ‘ఇంత డబ్బును పెళ్లి పేరిట అనవసరంగా ఖర్చు చేయడం ఎందుకు నాన్నా! పేదలకు, బడుగువర్గాల ప్రజలకు ఉపయోగపడే ఏదైనా పనిచేయవచ్చుగదా!’ అన్న కూతురు మాటలు మనోజ్‌కు నచ్చాయి. కూతురు పెళ్లి నాటికి 90 ఇళ్లను పేద కుటుంబాలకు కట్టి ఇచ్చారు.

4. పెళ్లి రోజున టీచర్లకు సన్మానం.....
గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి  చెందిన నిషాద్‌బాను వాజిఫ్‌దార్‌ అనే 22 ఏళ్ల పెళ్లి కూతురు నర్సరీ నుంచి పీజీ వరకు తనకు విద్యా బోధన చేసిన టీచర్లను పేరు పేరున పెళ్లికి ఆహ్వానించి, పెళ్లి పందిట్లోని వారందరికి శాలువాలు కప్పి సన్మానించారు. తాను చదువుకున్న ప్రాథమిక,మాధ్యమిక పాఠశాలలకు పది లక్షల రూపాయలను విరాళంగా కూడా అందజే శారు. ఆమె నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా అతిథులకు అతి సాధారణ భోజనం పెట్టారు.

5. ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్‌.....
శాశ్వతి శివ, కార్తిక్‌ కష్ణన్‌...ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పర్యావరణ పరిరక్షణను కోరుకునే వారు. పెళ్లిలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. పాలకు, కూల్‌ డ్రింకులకు బదులుగా అతిధుల కోసం కొబ్బరి బోండాలను ఏర్పాటు చేశారు. మాంసహారం జోలికి వెళ్లకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారి పెళ్లికి మరో విశేషం కూడా ఉంది. అతిథులను వారి పెంపుడు కుక్కలతో రావాల్సిందితా ఆహ్వానించారు. వారు అలాగే వచ్చారు.

6.  హిజ్రానే పెళ్లికి ముఖ్య సాక్షి....
కేరళ శస్త్ర సాహిత్య పరిషత్‌లో కార్యకర్తలుగా పనిచేస్తున్న రామ్‌నాథ్, శతిలు రిజిస్టార్‌ ఆఫీసుకెళ్లి నిరాడంబరంగ పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లికి ముఖ్య సాక్షిగా ఓ హిజ్రాను పిలిపించి సంతకం చేయించారు. అంతేకాకుండా పెళ్లి కూతురు బంగారు నగలకు బదులు జౌలితో చేసిన నగలను ధరించారు.

ఇలా ఎన్నో వినూత్న పెళ్లిళ్లు ఈ ఏడాదిలోనే జరగడం విశేషం. ఓ తండ్రి కన్నకూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును పేద పిల్లల పెళ్లి కోసం ఖర్చు పెట్టి. కూతురు పెళ్లిని నిరాడంబరంగా జరిపించారు. మరో తండ్రి తన కూతరు పెళ్లికి నగరంలోని వితంతువులందరిని పిలిపించారు. పెద్ద నోట్ల కష్టాల నేపథ్యంలో ఓ ఐఏఎస్‌ అధికారుల జంట కేవలం 500 రూపాయల ఖర్చుతోనే పెళ్లి తంతును ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement