వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు | US judge says spouses of H-1B Visa holders in tech sector can work in America | Sakshi
Sakshi News home page

వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు

Mar 31 2023 4:32 AM | Updated on Mar 31 2023 6:47 AM

US judge says spouses of H-1B Visa holders in tech sector can work in America - Sakshi

వాషింగ్టన్‌: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్‌ కంపెనీలు హెచ్‌–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది.

అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్‌ ఇమిగ్రెంట్‌ హెచ్‌–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్‌–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్‌–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్‌ కార్డ్‌ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది.

ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్‌ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్‌ పర్మిట్‌ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్‌ చేస్తామని సంస్థ తెలిపింది.

అభినందనీయం
‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్‌–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్‌ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్‌ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement