
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
పట్నా : ముస్లింలకు చెందిన రాజకీయ, మతసంస్ధలు ఉపయోగించే ఆకుపచ్చ జెండాలను నిషేధించాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఈసీని డిమాండ్ చేశారు. ఆయా సంస్ధలు వాడే ఈ జెండాలతో విద్వేషం వ్యాప్తి చెందుతోందని, మనం పాకిస్తాన్‌లో ఉన్నామనే వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌ను చీల్చాలనే కుట్ర పన్నిన శక్తులతో తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని, తాను సాంస్కృతిక జాతీయవాదం, అభివృద్ధి రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్‌లో 2014లో ఎన్డీఏ కూటమికి వచ్చిన 31 సీట్ల కంటే అధికంగా ఈసారి తమకు సీట్లు దక్కుతాయని గిరిరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే అన్ని నియోజకవర్గాల్లో తమ పోటీదారని, ఆయా అభ్యర్ధులంతా ఆయన ఎన్నికల చిహ్నాలని పేర్కొన్నారు. బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తున్న గిరిరాజ్ సింగ్ ఆర్జేడీ అభ్యర్ధి తన్వీర్ హసన్, సీపీఐ అభ్యర్ధి కన్నయ్య కుమార్‌లతో ముక్కోణపు పోటీలో తలపడుతున్నారు.