
రైతులందరికీ నిరంతర విద్యుత్
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రైతులందరికీ నిరంతర విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పాట్నా: వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రైతులందరికీ నిరంతర విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. శనివారం బీహార్‌లోని బాడ్ పట్టణంలో నిర్మించిన ఎన్టీపీసీ నాలుగో యూనిట్ ఎస్‌టీపీపీతో పాటు ముజఫర్‌పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా గోయల్ మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే గుజరాత్‌లోని రైతులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్‌జ్యోతి యోజన కింద నిరంతరాయ విద్యుత్ సరఫరాను పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం విజయవంతమైనందున, ఈ విధానాన్ని దేశమంత టా అమలు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే బీహార్‌లో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. బీహార్‌తోపాటు విద్యుత్ రంగంలో వెనకబడిన ఈశాన్య రాష్ట్రాలకు పూర్తి సహకారం అందించాలని ప్రధాని మోదీ సూచించినట్లు గోయల్ వెల్లడించారు. రాజకీయాలను పక్కనబెట్టి విద్యుత్ రంగంలో ఆయా రాష్ట్రాలకు చేయూతనివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్టీపీసీ యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో వేదికపై ఉన్న బ్యానర్లలో బీహార్ మాజీ సీఎం నితీశ్‌కుమార్ ఫొటో, పేరు లేకపోవడం వివాదాస్పదమైంది.